
కాంగ్రెస్ మేథోమధన సమావేశాలు చివరి దశకు వచ్చాయి. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వేదికగా ఈ నెల 13న ప్రారంభమైన కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించారు నేతలు. ఇవాళ ఏఐసీసీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. 6 కమిటీలు చేసిన ప్రపోజల్స్ కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఓకే చెప్పనుంది. దేశ రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ, యువజన అంశాలు సహా పార్టీ సంస్థాగత అంశాలపై 6కమిటీలు మూడు రోజులుగా చర్చలు జరుపుతున్నాయి. వీటిపై ఇవాళ CWC చర్చలు జరిపిన తర్వాత ..సోనియా గాంధీ ఉదయపూర్ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు.
ఎన్నికల్లో వరుస ఓటములు, అంతర్గత సవాళ్లు వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ.. తమ పనితీరుపై ఆత్మ విమర్శ చేసుకునేందుకు చింతన్ శివిర్ సమావేశాలు ఏర్పాటుచేసింది. 2024 ఎన్నికలకు సిద్ధమవుతూనే పార్టీని పూర్తిగా సంస్కరించాలని నేతలు ఆశిస్తుండటంతో 3 రోజుల పాటు మేథోమథన సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏఐసీసీ. ఒకే కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ కుటుంబంలో మరో సభ్యుడు పదేండ్లకంటే ఎక్కువ పార్టీతో కోసం పని చేస్తే మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. బూత్, బ్లాక్, మండల కమిటీలు ఏర్పాటు చేయడం..అన్ని కమిటీల్లో 50 శాతం పదవులు..బలహీన వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించారు.పార్టీ నిర్ణయాలను CWC ఆమోదించిన తర్వాత సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది.