మున్సి పల్ క్యాండి డేట్ల కోసం కాంగ్రెస్ సర్వే

మున్సి పల్ క్యాండి డేట్ల కోసం కాంగ్రెస్ సర్వే
  •     పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మూడు సర్వే ఏజెన్సీలకు బాధ్యతలు 
  •     సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన సీఎం రేవంత్​ 

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్​ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపికకు సర్వేలు చేపడుతున్నది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డివిజన్ల వారీగా ఆశావహుల నుంచి ఇప్పటికే అప్లికేషన్లు తీసుకున్నది. ఆ లిస్టుల ఆధారంగా జల్లెడ పడుతున్నది. ప్రజాబలం, గెలుపు అవకాశాలు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని సీఎం రేవంత్  పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇదే విషయాన్ని ఇన్​చార్జ్​ మంత్రులకూ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైకమాండ్ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి మూడు సర్వే ఏజెన్సీలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు అప్పగించింది. 

ఈ సర్వేలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నట్లు పార్టీవర్గాలు చెప్తున్నాయి. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల సర్వే బాధ్యతలు ఒక ఏజెన్సీకి, ఉత్తర తెలంగాణ పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యతలను మరో ఏజెన్సీకి, దక్షిణ ప్రాంత మున్సిపాలిటీల సర్వే బాధ్యతలను ఇంకో ఏజెన్సీకి అప్పగించారు. 

ఇందులో చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సర్వే నివేదిక ఇప్పటికే పార్టీ హైకమాండ్​చేతికి అందినట్లు తెలిసింది. మిగతా రెండు ఏజెన్సీల సర్వే నివేదికలు కూడా త్వరలోనే  అందనున్నాయి. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి ఈ నివేదికలు రాగానే ఇన్​చార్జ్​ మంత్రులకు అందజేయనున్నారు. వాళ్లు ఎమ్మెల్యేలతో కలిసి మరోసారి చర్చించి అభ్యర్థులను ఫైనల్​చేయనున్నట్లు సమాచారం. 

మరోవైపు బీసీలకు చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలనుకున్నా సాధ్యపడకపోవడంతో ఆ మేరకు జనరల్​ సీట్లలో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని హైకమాండ్​ భావిస్తున్నది.  తద్వారా పార్టీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనే ఆలోచనతో ఉంది. దీనిపై ఇప్పటికే పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి ఏకాభిప్రాయానికి రావడంతో ఆ దిశగానే అభ్యర్థుల ఎంపిక ఉండనుంది. ఈ క్రమంలోనే జనరల్​స్థానాల్లోనూ పెద్దసంఖ్యలో బీసీలు, బీసీ మహిళలు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవడం విశేషం.