
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై అనేక సందేహాలు ఉన్నాయని, వీటన్నింటికీ కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని లోక్‌సభలో కాంగ్రెస్డిప్యూటీ లీడర్ గౌరవ్‌గొగోయ్ డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల కోసం తాము ప్రశ్నిస్తూనే ఉంటామని, కేంద్రం పారిపోకుండా సమాధానాలు చెప్పాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగం తర్వాత ఆయన మాట్లాడారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి అనేక విషయాలు చెప్పారని, కానీ పహల్గాంకు టెర్రరిస్టులు ఎలా రాగలిగారో మాత్రం చెప్పలేదని అన్నారు. ‘‘భారత్, పాక్మధ్య కాల్పుల విరమణకు వాణిజ్యాన్ని ఉపయోగించుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26 సార్లు చెప్పారు. పాకిస్తాన్కాళ్లబేరానికి వస్తేనే సీజ్‌ఫైర్‌కు అంగీకరించారని మీరంటున్నారు. దీని వెనుక ఉన్న నిజమేంటో మేం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ప్రధాని మోదీ ఎవరికి తలొగ్గారు?” అని గొగోయ్ ప్రశ్నించారు.
పీవోకేను ఎప్పుడు స్వాధీనం చేస్కుంటం..?
ఉరి, పుల్వామా, ఆపరేషన్ సిందూర్తర్వాత తాము శత్రుదేశం ఇంట్లోకి వెళ్లి దాడిచేశామని మోదీ చెప్పుకుంటున్నారని గొగోయ్అన్నారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని చెబుతున్నారని, అసలు ఇది విజయవంతమైందా..? లేదా..? క్లారిటీ ఎప్పుడిస్తారని అడిగారు.
‘‘యుద్ధం అంటే భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం కాదని అధికార పక్షం అంటున్నది. మరి పీవోకే సంగతేంటి. దాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు?” అని ప్రశ్నించారు. ఈ రోజుకాకుంటే ఇంకెప్పుడు తీసుకుంటామో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్రదాడికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఎన్ని ఫైటర్ జెట్స్ కోల్పోయాం..?
ఒక్కో ఫైటర్జెట్కోట్లాది రూపాయల విలువైనదని, ఆపరేషన్ సిందూర్‌లో దేశం ఎన్ని జెట్స్కోల్పోయిందో తెలుసుకోవాలనుకుంటున్నామని, నిజం వినేందుకు దేశానికి ధైర్యం ఉన్నదని అన్నారు. రక్షణ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో 35 రాఫెల్స్యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయని, అవి కోల్పోతే దేశ రక్షణ వ్యవస్థకు పెద్ద నష్టమని పేర్కొన్నారు.
ఉగ్రవాదం వెన్ను విరిచామని హోం మంత్రి పదేపదే చెబుతున్నారని, మరి అలాంటప్పుడు ఉరి, బాలాకోట్, పహల్గాం దాడులు ఎలా జరిగాయని ప్రశ్నించారు. అంత పెద్ద ఉగ్రదాడి జరిగిన తర్వాత సౌదీ నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ పహల్గాంకు వెళ్లకుండా.. బిహార్‌లో జరిగిన రాజకీయ కార్యక్రమానికి వెళ్లారని విమర్శించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే పహల్గాంవెళ్లి.. బాధితులను పరామర్శించారని, ఉగ్రదాడిలో చనిపోయినవారికి అమరవీరుల హోదా డిమాండ్ చేశారని చెప్పారు.