
ఆర్మూర్, వెలుగు: జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కు కొనసాగింపుగా జిల్లాలో తొలిసారి ఆర్మూర్లో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీనటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ శనివారం చేపట్టిన జనహిత పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. దాదాపు మూడున్నర గంటల పాటు 10 కిలో మీటర్లు పాదయాత్ర సాగింది. ఆర్మూర్ టౌన్ లోని ఆలూర్ రోడ్డులో పాదయాత్రకు ముందు ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అక్కడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర కాశీహన్మాన్ మున్నురుకాపు సంఘం వరకు చేరగా, అక్కడ సమావేశమైన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు మహిళలు, రైతులతో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీనటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆత్మీయంగా పలకరించి, కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండాలని కోరారు. రైతు సమస్యలను వివరించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో ఒక రోజు ముఖాముఖి చేయిస్తానని, 15 మంది రైతు బృందం రావాలని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు.
అక్కడి నుంచి జమ్మన్జట్టి, శివాజీ చౌక్, పాతబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ చౌరస్తాకు పాదయాత్ర చేరింది. దారిపొడవునా జై కాంగ్రెస్ అన్న నినాదాలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తూ ముందుకుసాగారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీనటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ పూలమాలలు వేశారు. పాదయాత్రలో వారిద్దరిని పద్మశాలి సంఘం, క్షత్రీయ సమాజ్తో పాటు వివిధ కుల సంఘాల వారు సత్కరించారు.
370 జీవో అమలు చేయాలని బాధిత ఉద్యోగులు వినతిపత్రం ఇచ్చారు. 10 కిలోమీటర్ల జనహిత పాదయాత్ర సక్సెస్ చేయడంలో కాంగ్రెస్నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి కృషి చేశారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, మార చంద్రమోహన్, కోల వెంకటేశ్, భూపేందర్, కొంతం మురళీ, వెంకట్రాంరెడ్డి, మారుతిరెడ్డి, దేగాం ప్రమోద్ తదిరులు పాల్గొన్నారు.