మద్దూరు, వెలుగు : ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో జరుగుతున్న బావోజీ బ్రహ్మోత్సవాలకు శుక్రవారం మధ్యాహ్నం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీమంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం జాతర సమీపంలోని ఎక్కమేడ్ శివారులో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతోందని.. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. ఎస్టీ కార్పొరేషన్‌కు తాళం వేసి మూలన పడేశారన్నారు. బడ్జెట్‌లో రూ.2,730 కోట్లు కేటాయించినా.. రూ.50 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, ఎస్సీ, ఎస్టీ యువకులకు లోన్లు ఇవ్వడం లేదన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు తండాలను గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేశామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక గిరిజన యువత చదువులకు దూరమతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీకి, క్యాంప ఆఫీస్‌కి, మనువడితో ఫుట్ బాల్ పోటీలు, అందాల పోటీల నిర్వహణకు డబ్బులు ఉంటాయి కానీ గిరిజనుల అభివృద్ధికి మనసు రావడం లేదా ?
అని ప్రశ్నించారు.
