పరీక్షల వాయిదాతోనే ఆత్మహత్యలు: రాహుల్ ​గాంధీ

పరీక్షల వాయిదాతోనే ఆత్మహత్యలు: రాహుల్ ​గాంధీ

హైదరాబాద్, వెలుగు: విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్యపై కాంగ్రెస్ ​హైకమాండ్ స్పందించింది. ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్​ సర్కార్​పై మండిపడింది. శనివారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, నేతలు రాహుల్ ​గాంధీ, ప్రియాంక గాంధీ ట్విట్టర్​ వేదికగా ప్రవల్లిక మృతికి సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

‘‘టీఎస్​పీఎస్సీ పదే పదే పరీక్షలను వాయిదా వేస్తుండడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు. పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ ​ప్రభుత్వ చేతగానితనంతో వేలాది మంది నష్టపోతున్నారు. ప్రవల్లిక ఆత్మహత్యకు‌ అవినీతి, అసమర్థ బీఆర్ఎస్ ​ప్రభుత్వానిదే బాధ్యత’’ అని ఖర్గే ట్వీట్ చేశారు. ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని రాహుల్​ గాంధీ అన్నారు.

ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. ‘‘నిరుద్యోగ యువత కలలు, ఆశలను ప్రభుత్వం హత్య చేసింది. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. మేం వచ్చాక ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇది మా గ్యారంటీ” అని హామీ ఇచ్చారు. పదేపదే ఉద్యోగ నియామక పరీక్షలను వాయిదా వేయ డం వల్ల నిరుద్యోగులు మనోవేదనకు గురవుతున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. తాము వచ్చాక ఇలాంటి పరిస్థితులు ఉండవని చెప్పారు.