లోపాలు లేవని చెప్పి ఈ రిపేర్లేంది?

లోపాలు లేవని చెప్పి ఈ రిపేర్లేంది?
  •                 మిడ్​మానేరు లీకేజీలపై కాంగ్రెస్​ ఫైర్​
  •                 తాత్కాలిక పనులతో సరిపెడితే ఊరుకోం
  •                 మళ్లీ కట్టను కట్టేవరకు నీళ్లు నింపనివ్వం
  •                 లోపాలపై న్యాయ విచారణ జరిపించాలి
  •                 కాంగ్రెస్​ నేతలు జీవన్​రెడ్డి, పొన్నం డిమాండ్​
  •                 కట్టను పరిశీలించి..స్థానికులతో మాట్లాడిన నేతలు

మిడ్​ మానేరు ప్రాజెక్టు లీకేజీలను సర్కారు పట్టించుకోవడం లేదని, తాత్కాలిక నిర్మాణాలతోనే సరిపెడుతోందని కాంగ్రెస్​ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. మళ్లీ కట్టను కట్టాల్సిందేనని, నిర్మాణ వైఫల్యాలపై న్యాయ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్​ చేశారు. తిరిగి కట్టను కట్టేవరకు నీళ్లు నింపనివ్వబోమని హెచ్చరించారు. మిడ్​మానేరు ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయ అని చెప్తున్న ప్రభుత్వం.. అలాంటి గుండెకాయకు రంధ్రం పడినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆదివారం మిడ్​మానేరు కట్టను వారు సందర్శించారు. కట్టపై తిరుగుతూ లోపాలను అధ్యయనం చేశారు. కట్టపై వేసిన బోర్లను, ప్రాజెక్టులోని నీటిని, ప్రాజెక్టు లోపల జరుగుతున్న నీటి ఎత్తిపోతలను పరిశీలించారు. అనంతరం గ్రామ సర్పంచ్​తో పాటు గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: జీవన్​రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు ప్రమాదాలు జరిగాయని, గత ఏడాది మేడారం చెరువులో, ప్రస్తుతం మిడ్​మానేరులో అని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మీడియాతో అన్నారు. వీటిని బట్టి చూస్తే నీటి పారుదల ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్య ఏమిటో అర్థమవుతుందని దుయ్యబట్టారు. మిడ్​మానేరు ఎడమ కట్ట మధ్యలో ఉన్న బోగమర్రి ఒర్రె ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రింగ్​ బండ్​ (వలయాకారపు కట్ట) తాత్కాలికం మాత్రమేనని, ఈ లీకేజీలపై పూర్తి శ్రద్ధచూపాలని డిమాండ్​ చేశారు. వెంటనే మిడ్​మానేరు కట్ట నిర్మాణ వైఫల్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు న్యాయ విచారణ జరిపించాలన్నారు. కట్టలో ఎలాంటి లోపం లేదని చెబుతున్న ప్రభుత్వం.. కట్టలోని బోగమర్రి ఒర్రె ప్రాంతంలో రింగ్​బండ్​ ఏర్పాటు చేయడాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో గ్రౌటింగ్​ చేసి కట్టను మళ్లీ నిర్మించాలని డిమాండ్​ చేశారు. కట్టలో లోపాల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు బయపడుతూ బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాన్వాడ గ్రామంతో పాటు కందికట్కూర్​ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్​ చేశారు. అనంతరం మాన్వాడ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ.. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. బోగమర్రి ఒర్రె ప్రాంతంలో కట్టను పూర్తి స్థాయిలో తొలగించి పునర్నిర్మించే వరకు మిడ్​మానేరులో నీళ్లు నింపనిచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

వాస్తవాలు ప్రజలకు చెప్పాలి: పొన్నం

కాంగ్రెస్​ పార్టీ మిడ్​మానేరు నిర్మాణంలో తట్టెడు మట్టిని కూడా తీయలేదని ఆరోపించిన టీఆర్​ఎస్​ పార్టీ ప్రస్తుతం మిడ్​మానేరులో లోపాలు బయటపడిన తర్వాత 85 శాతం పనులు కాంగ్రెస్​ హయాంలోనే అయ్యాయని చెప్పడం ఏమిటని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. కాంగ్రెస్​ హయాంలో ఉన్న ఈఎన్​సీ మురళీధర్​రావు ఇప్పుడు కూడా పని చేస్తున్నారని, అలాగే ఇరిగేషన్​ సెక్రెటరీగా ఆనాడు ఉన్న ఎస్​కే జోషీ ప్రస్తుతం సీఎస్​ గా పని చేస్తున్నారని, వారిని అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలని ప్రభుత్వానికి హితవుపలికారు. ప్రాజెక్టు కింద ఉన్న నాలుగైదు గ్రామాల ప్రజలు భయపడుతున్నారని, మిడ్​మానేరు ప్రాజెక్టులోని వాస్తవాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం,  ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షుడు కూస రవీందర్​, కన్వీనర్​ పిల్లి కనకయ్య పాల్గొన్నారు.