పదవి కాపాడుకోవడానికే ఆర్ఎస్ఎస్ జపం: ప్రధాని మోడీ స్పీచ్‎పై కాంగ్రెస్ ఫైర్

పదవి కాపాడుకోవడానికే ఆర్ఎస్ఎస్ జపం: ప్రధాని మోడీ స్పీచ్‎పై కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ: ఎర్రకోటపై నుంచి ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో ఆర్ఎస్ఎస్‎ను ప్రధాని నరేంద్ర మోదీ పొగడటంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇది చాలా బాధాకరమైన, విచారకరమైన విషయమని విమర్శించాయి. ప్రధాని స్పీచ్‏పై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. మోదీ ప్రసంగం రాజ్యాంగ స్ఫూర్తి, లౌకిక గణతంత్రానికి విఘాతం కలిగించేలా ఉందన్నారు. కాలంచెల్లిన, కపట, పస లేని ప్రసంగం చేశారన్నారు.

‘‘బీజేపీలో 75 ఏండ్లు నిండిన నాయకులు తప్పుకుని, యువ నేతలకు చాన్స్ ఇవ్వాలని ఇదివరకే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. వచ్చే నెలలో మోదీకి 75 ఏండ్లు నిండనున్నాయి. అందుకే పదవిని కాపాడుకోవడం కోసమే ఆయన ఆర్ఎస్ఎస్ జపం చేశారు” అని అన్నారు. 

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. దేశంలో ప్రజలను మతపరంగా విభజించేందుకే ఆర్ఎస్ఎస్‎ను బ్రిటిష్ వారు ఏర్పాటు చేయించారని చెప్తారని.. అందుకే ఆర్ఎస్ఎస్‎కు వందేండ్లు అవుతున్న సందర్భంగా బ్రిటిష్ వారికే అభినందనలు చెప్పాలని సెటైర్ వేశారు. సీపీఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ కూడా మోదీ స్పీచ్‎పై విమర్శలు గుప్పించారు. 

ఆర్ఎస్ఎస్‎ను నెహ్రూ ఆహ్వానించారు: బీజేపీ 

ప్రధాని మోదీ స్పీచ్‎పై ప్రతిపక్షాల విమర్శలను బీజేపీ తప్పుపట్టింది. ఆర్ఎస్ఎస్ దేశభక్తులతో కూడిన సంస్థ అని.. దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తూ, వందేండ్లు పూర్తి చేసుకుంటున్న ఆ సంస్థ గురించి ప్రస్తావించడంలో తప్పేముందని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ప్రశ్నించారు. నిజానికి 1963లో రిపబ్లిక్ డే పరేడ్‎కు అప్పటి ప్రధాని నెహ్రూ స్వయంగా ఆర్ఎస్ఎస్‎కు ఆహ్వానం పంపారన్నారు.