రేపు(అక్టోబర్15) కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్

రేపు(అక్టోబర్15) కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్
  • 58 నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు
  • మిగితా స్థానాల్లో తీవ్ర పోటీ... ఎంపికకు మరింత టైమ్
  • 18 లోపు తుది జాబితా విడుదలకు కసరత్తు

న్యూఢిల్లీ, వెలుగు: ఈ నెల15న కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కానుంది. దాదాపు 58 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే చాన్స్ కనిపిస్తోంది. మొత్తం 70 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముగించినప్పటికీ, ఇందులో 58 మంది అభ్యర్థులకు అధిష్టానం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. నేటితో మహాలయ పక్షం ముగుస్తుడటంతో.. రేపు అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో భాగంగా శుక్రవారం జీఆర్జీ రోడ్ నెంబర్15లోని ‘వార్ రూమ్’లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నాలుగో సారి భేటీ అయింది. మధ్యాహ్నం12 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 నిమిషాల వరకు ఈ భేటి సాగింది. 

స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులు బాబా సిద్ధిఖీ, జిగ్నేష్ మేవాని, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్​చార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఏఐసీసీ సెక్రటరీలు పీసీ విష్ణునాథ్, మన్సూర్ అలీఖాన్, రోహిత్ చౌదరి, స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పాల్గొన్నారు. 

ఈ భేటీలో ప్రధానంగా119 స్థానాల్లో అభ్యర్థల ఎంపికపై చర్చ జరిగినట్లు తెలిసింది. సీనియర్ నేతలు బరిలో ఉన్న స్థానాలు, ఒక అసెంబ్లీకి ఒకరు లేదా ఇద్దరు పోటీ పడుతున్న స్థానాలు, ఎలాంటి వివాదాలు లేని దాదాపు 40 నుంచి 60 స్థానాలపై మొదటి రెండు మీటింగ్ లో కమిటీ క్లారిటీకి వచ్చింది. తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై శుక్రవారం తొలిసారి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్(సీఈసీ) భేటీ అయింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో తెలంగాణతో పాటు మధ్య ప్రదేశ్ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ డిస్కస్ చేసింది. 

మురళీధరన్ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన అభ్యర్థుల జాబితాపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్, సామాజిక వర్గాల విజ్ఞప్తులు, ఓయూ విద్యార్థుల డిమాండ్ల నేపథ్యంలో.. పలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, స్థానిక అంశాలపై ఖర్గే, రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు తెలిసింది. 

70 సీట్లతో లిస్ట్ రెడీగా ఉంది: మురళీధరన్

70 అసెంబ్లీ సీట్లతో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, వారికి కేటాయించే సీట్లపై క్లారిటీ రాగానే ఒకేసారి లిస్ట్ ప్రకటిస్తామని చెప్పారు. సీఈసీ భేటీ తర్వాత మురళీధరన్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం జరిగిన సీఈసీ భేటీలో భేటీలో కేవలం 70 స్థానాలపై చర్చ జరిగిందన్నారు. 

 వివాదాస్పద సీట్లపై నిర్ణయం అధిష్టానానిదే...

స్క్రీనింగ్ కమిటీలో క్లారిటీ రాని వివాదస్పద సీట్లపై నిర్ణయం పార్టీ అధిష్టానానిదే అని కమిటీ సభ్యులు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు119 స్థానాల్లో అభ్యర్థుల పై చర్చ జరిగిందన్నారు. స్పష్టత రాని కొన్ని స్థానాలను ప్యానెల్ కి పంపించినట్లు చెప్పారు. వీటిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నిర్ణయం తీసుకుంటారన్నారు. సీఈసీ ఆమోదం తర్వాత లిస్ట్ ఏ క్షణమైనా విడుదల కావొచ్చన్నారు.