మోదీ వ్యాఖ్యలపై దుమారం!..దేశం కోసం నా తల్లి తాళిబొట్టునే త్యాగం చేసింది

మోదీ వ్యాఖ్యలపై దుమారం!..దేశం కోసం నా తల్లి తాళిబొట్టునే త్యాగం చేసింది
  • నిన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని కామెంట్​
  • మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్..​ సుప్రీంకోర్టుకు సీపీఎం

దేశ ప్రజల ఆస్తులు, బంగారంపై కాంగ్రెస్​ కన్నేసిందని, ఆ పార్టీ  అధికారంలోకి వస్తే తాళిబొట్లను కూడా గుంజుకుంటదని రాజస్థాన్​, యూపీ ఎన్నికల ప్రచారంలో కామెంట్​ చేసిన మోదీ.. మంగళవారం మరోసారి అదేతరహా వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్​ హయాంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని మరోసారి సంచలన కామెంట్స్​ చేశారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ‘దేశం కోసం నా తల్లి తాళిబొట్టునే త్యాగం చేసింది. మంగళసూత్రం విలువ తెలిస్తే మోదీ అలా మాట్లాడరు’ అని కాంగ్రెస్​ నేత ప్రియాంకా గాంధీ కౌంటర్​ ఇచ్చారు. మోదీపై సుప్రీంను ఆశ్రయించినట్టు సీపీఎం వెల్లడించింది. మోదీపై అనర్హత వేటు వేయాలని కర్నాటక మంత్రి హెచ్ కే పాటిల్ ఈసీని డిమాండ్ చేశారు. ప్రధానిపై ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు ఈసీ తెలిపింది.

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజల బంగారం, మంగళసూత్రాలు కూడా లాక్కుంటుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా ఫైర్ అయ్యారు. దేశం కోసం తన తల్లి సోనియా గాంధీ తాళిబొట్టునే త్యాగం చేశారని అన్నారు. మంగళవారం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక మాట్లాడారు. ‘‘దేశంలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నరు? కాంగ్రెస్ మీ మంగళసూత్రాలను లాక్కుంటుందంటూ రెండ్రోజుల క్రితం కొందరు అన్నారు.

ఈ దేశం 75 ఏండ్ల నుంచి స్వేచ్ఛగా ఉంది. 55 ఏండ్లు కాంగ్రెస్ పాలనలో ఉంది. కాంగ్రెస్ ఎప్పుడైనా మీ బంగారాన్ని లేదా మంగళసూత్రాలను లాక్కున్నదా?” అంటూ ప్రజలను ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే.. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు, ఆస్తులను చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఓ వర్గం వారికి కట్టబెడ్తుందని, మన తల్లులు, అక్కాచెల్లెండ్ల బంగారం, మంగళసూత్రాలను దోచుకుంటుందంటూ ప్రధాని మోదీ సోమవారం చేసిన కామెంట్లను ప్రియాంక ఖండించారు. ‘‘దేశం యుద్ధం చేయాల్సి వచ్చిన సమయంలో ఇందిరా గాంధీ తన బంగారాన్ని డొనేట్ చేశారు. దేశం కోసం నా తల్లి మంగళసూత్రాన్నే త్యాగం చేసింది. అసలు మంగళసూత్రం విలువేంటో మోదీకి తెలిసి ఉంటే.. ఇలాంటి అనైతిక మాటలు మాట్లాడేవారే కాదు” అని ఆమె విమర్శించారు.