
సత్తుపల్లి, వెలుగు : మహిళల శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన 24 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో పేద క్రిష్టియన్ మహిళలకు శుక్రవారం అందజేశారు.
పట్టణంలోని పలు వార్డులకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
త్వరలో దసరా కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు బాగం నీరజ, దోమ ఆనంద్, మైనార్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి ముజాహిద్, కమిషనర్ నరసింహ, నాయకులు గాదె చేన్నారావు, తోట సుజల రాణి, దొడ్డ శ్రీను పాల్గొన్నారు.