డిప్యూటీ స్పీకర్.. చీఫ్ విప్, మూడు విప్ పోస్టులు.. 6 మంత్రి పదవులెవరికి?

డిప్యూటీ స్పీకర్.. చీఫ్ విప్, మూడు విప్ పోస్టులు.. 6 మంత్రి పదవులెవరికి?
  • 4 జిల్లాలకు చాన్స్ దక్కలే
  • డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ
  • చీఫ్ విఫ్, మూడు విప్ పోస్టులు
  • పోటీలో సీనియర్ లీడర్లు, బీసీ నేతలు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. నిన్న సీఎంగా రేవంత్ రెడ్డి, 11 మంది మంత్రులు, స్పీకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఇంకా పోర్ట్ ఫోలియోలు కేటాయించాల్సి ఉంది.  ఈ అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీ బయల్దేరిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఇంకా ఆరు మంత్రి పదవులు కేటాయించాల్సి ఉంది. వీటితోపాలు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, మూడు విప్ పదవులను కేటాయించాల్సి ఉంటుంది. వీటి కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ చాన్స్ ఇవ్వలేదు. పూర్వ రంగారెడ్డి జిల్లాకు చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ పోస్టు దక్కినా.. ఆ జిల్లాకు మంత్రి  పదవి లభించలేదు.  సామాజిక, భౌగోళిక సమీకరణాల నేపథ్యంలో తమకు మంత్రి పదవి దక్కుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఆదిలాబాద్ చెన్నూరు నుంచి గెలిచిన సీనియర్  నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇబ్రహీంపట్నం నుంచి విజయం సాధించిన మల్ రెడ్డి రంగారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి రేసులో ఉన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తన సెగ్మెంట్ ను వదులు కొని నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన షబ్బీర్ అలీ కూడా మంత్రి పదవి రేసులో కొనసాగుతున్నారు.  సనత్ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి  పాలైన కోట నీలిమ కూడా రేసులో ఉన్నట్టు సమాచారం.   బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మాత్రమే అవకాశం లభించింది. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మధుయాష్కీకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అంజన్ కుమార్ యాదవ్, ఆలేరు నుంచి గెలిచిన బీర్ల ఐలయ్య మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. షాద్ నగర్ నుంచి ఎన్నికైన ఈర్లపల్లి శంకరయ్య రజక సామాజిక వర్గానికి చెందిన వారు ఆయనకు ఏదో ఒక పదవి కట్టబెట్టే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.