బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

బడుగు బలహీన వర్గాలకు  అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • మంత్రి తుమ్మలతో కలిసి వెంగళరావునగర్​లో ప్రచారం

జూబ్లీహిల్స్​, వెలుగు: 
బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్​లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలుపుతో ఈ ప్రాంతంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. వెంగళరావునగర్ డివిజన్​లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తో కలిసి ఆదివారం (నవంబర్ 09) ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ..  జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంతోకాలంగా నవీన్ యాదవ్ చేస్తున్న సేవ ఈ ప్రాంత ప్రజలకు తెలిసిందేనని, ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.  మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందన్నారు. అయినప్పటికీ సంక్షేమ పథకాలను ఆపడం లేదన్నారు.

నవీన్ యాదవ్​తోనే  జూబ్లీహిల్స్ అభివృద్ధి:   పొన్నం

యూసుఫ్ గూడ డివిజన్ , కృష్ణ నగర్ లో  మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ స్థానిక నాయకుడైన నవీన్ యాదవ్​ను గెలిపించాలని కోరారు. ఈ ప్రాంత సమస్యలపై నవీన్ కుమార్ యాదవ్ కు సంపూర్ణమైన అవగాహన ఉందని ఆయనతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత మూడు నెలలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, తాము అభివృద్ధి చేసి మాత్రమే ఓట్లు అడుగుతున్నామన్నారు.

అత్యధిక మెజారిటీ కోసం పనిచేయండి: మంత్రి దామోదర

జూబ్లీహిల్స్​కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అత్యధిక మెజారిటీ వచ్చేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం ఎర్రగడ్డలోని ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటరాజ్ నగర్, న్యూ సుల్తాన్ నగర్, ఫాతిమా నగర్​కు చెందిన సుమారు 150 మంది ముస్లిం యువకులు దామోదర సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఉండే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు స్థానిక నాయకుడైన నవీన్​ తోనే సాధ్యమవుతుందన్నారు.