ముమ్మాటికీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : ఇమ్రాన్ ప్రతాప్ గర్హి

ముమ్మాటికీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే :  ఇమ్రాన్ ప్రతాప్ గర్హి

నల్గొండ అర్బన్, వెలుగు : తెలంగాణలో ముమ్మాటికీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్​ పార్టీయేనని ఏఐసీసీ స్టార్  క్యాంపెయినర్, రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్  ప్రతాప్  గర్హి అన్నారు. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ ఒక్కటే అని ఆయన విమర్శించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముస్లింల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్  చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్  కుటుంబం, బీఆర్ఎస్  నేతలు మాత్రమే బాగుపడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో సీబీఐతో అన్ని పార్టీల నాయకుల ఇండ్లలో మోదీ సోదాలు చేయిస్తున్నారని, కేసీఆర్  కుటుంబంలో ఎక్కడ సోదాలు చేయించిన  దాఖలాలు లేవని ఫైర్  అయ్యారు.

కేటీఆర్ ను సీఎం చేయడానికి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ముస్లింలు అందరూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్  అధికారంలోకి వస్తే ముస్లింలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జమ్మూకశ్మీర్  పీసీసీ అధ్యక్షుడు వికాస్ రసూల్, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్  హఫీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.