తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: రేవంత్ రెడ్డి

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: రేవంత్ రెడ్డి
  • వారికిచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుచేయలే: రేవంత్ రెడ్డి
  • ఉమ్మడి పాలమూరులో 14 సీట్లు గెలుస్తమని ధీమా
  • బిజినేపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ

నాగర్ కర్నూల్, వెలుగు: దళితుడిని తెలంగాణ సీఎం కుర్చీమీద కూర్చోబెట్టి కాపలా కుక్కలా ఉంటానన్న సీఎం కేసీఆర్ ​మాట తప్పి చరిత్రహీనుడిగా మిగిలారని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆ దళితుల ఉసురు తగిలే ఈ సర్కారు కూలుతుందన్నారు. తెలంగాణ పేరు పలకడానికి కూడా సిగ్గుపడుతున్న కేసీఆర్​ను రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపుతారని చెప్పారు. ఆదివారం నాగర్​ కర్నూల్ ​జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో రేవంత్​పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పాలనలో సామాన్య దళిత, గిరిజనులతోపాటు దళిత ఐఏఎస్, ఐపీఎస్​లు అవమానాలకు గురవుతున్నారన్నారు. ఆయన దగ్గర పనిచేసే పరిస్థితి లేక ఉద్యోగాలను వదులుకుంటున్నారని అన్నారు. తెలంగాణ గడ్డపై పెత్తనం చెలాయిస్తున్న దొరలు నేటికీ దళిత, గిరిజనులను తొక్కిపెడ్తున్నారన్నారు. నాలుగేళ్లయినా పాలమూరు ప్రాజెక్టు పనులు అడుగు ముందుకు పడలేదన్నారు. పనుల పరిశీలనకు వెళ్లిన సీనియర్​ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిపై ఈ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. అలాగే దళిత గిరిజనులైన మిద్దె రాములు, రాస్లావత్​ వాల్యానాయక్ గొంతుపై కాలు పెట్టి తొక్కిచంపాలని చూసిన వాళ్లను వదిలేసిందన్నారు. గతంలో నాగం సంగతి చూస్తానన్న గాలి జనార్దన్ రెడ్డికి చిప్పకూడే దిక్కయిందని, ఇప్పుడు ఇక్కడున్న మర్రి జనార్దన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే అవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్​హయాంలో జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు పూర్తికావడం వల్లే పాలమూరు పచ్చబడిందన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫొటోలు దిగడం సిగ్గుచేటన్నారు. దొరలకు బీఆర్ఎస్, పెట్టుబడిదారులకు బీజేపీ ఉంటే.. దళిత గిరిజన నిరుపేదలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, అలాంటి పార్టీని, జెండాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని14 సీట్లను తామే గెలుచుకుంటామని, రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా వారిని తన భుజాలపై మోసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత తనదేని చెప్పారు.

కేసీఆర్​ అసైన్డ్​ భూములు గుంజుకుంటుండు: నాగం

ఇన్నేండ్లు ప్రజాజీవితంలో ఉన్నా.. డాక్టర్​గా, మంత్రిగా పనిచేసిన తనను చప్రాసీగా పనికిరానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అంటుండని విమర్శించారు. గుట్టలు, చెరువులు, నల్లమట్టి మింగుతున్నడని ఆరోపించారు. ప్రాజెక్టులు ఎందుకు కడ్తలేరని అడిగితే దాడులు చేస్తూ ఉల్టా మాపైనే కేసులు పెట్టిస్తున్నాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములిచ్చి, ప్రాజెక్టులు కట్టి, కరెంట్ఇచ్చి బతుకు దెరువు ఇచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భూములు కేసీఆర్​గుంజుకుంటున్నడని అన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం సాధించుకున్న తెలంగాణ ఎవని పాలయ్యిందని ప్రశ్నించారు. తెలంగాణలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులు, అరాచకాలు చూస్తుంటే కడుపు రగిలిపోతోందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే అన్నివర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు.

ముగిసిన ఠాక్రే పర్యటన

తెలంగాణ కాంగ్రెస్ ఇన్​చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే రాష్ట్ర పర్యటన ముగించుకొని పుణే తిరిగి వెళ్లారు. ఆదివారం కొందరు సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. గాంధీభవన్​లో స్వాతంత్ర సమరయోధుడు స్వామీ రామనందతీర్థ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత ఆయన నాగర్​కర్నూల్​లో సభకు వెళ్లారు అక్కడ నుంచి తిరిగి వచ్చి పుణే వెళ్లారు.

దాడులకు భయపడం:  మాణిక్ రావ్ ఠాక్రే

కాంగ్రెస్‌ పేదల పక్షాన పోరాటం చేస్తోందని, తమ కార్యకర్తలపై  బీఆర్ఎస్ దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావ్ ఠాక్రే హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై హత్యాయత్నం చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. ఏ వర్గంపై దాడులు జరిగినా కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదన్నారు. సోనియా తెలంగాణ ఇచ్చారని అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ వికాసం కోసం ఆమె రాష్ట్రం ఏర్పాటు చేశారన్నారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. 

కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి: భట్టి
తెలంగాణలో దళిత, గిరిజనులకు జరుగుతున్న అవమానాలు, వాళ్లపై దాడులు ఆగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీనియర్ లీడర్, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మార్కండేయ  ప్రాజెక్టు విజిట్​కు వెళ్తుంటే ఆయన వెంట వెళ్లిన వాల్య నాయక్, రాములును కింద పడేసి మెడపై కాలు వేసి తొక్కిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ జెండా మోస్తే చాలు, ఎవరినైనా కొట్టొచ్చు, చంపొచ్చు అన్నట్లుగా రాష్ట్ర సర్కార్ తీరు ఉందన్నారు. అందువల్లే ఆ పార్టీ నాయకులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు పూర్తి చేయాలని అడిగితే దాడులకు దిగే దుర్మార్గాలను చూస్తూ ఊరుకోలేకే బిజినేపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ పెట్టామన్నారు. దాడులు చేసిన వారిని వదిలి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పై అక్రమంగా కేసులు పెట్టడం నీచమన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. పోలీసులు చట్ట ప్రకారంగా పని చేయాలని సూచించారు.