హంగ్​ రాదు.. 85 సీట్లు పక్కా.. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమే: రేవంత్​రెడ్డి

హంగ్​ రాదు.. 85 సీట్లు పక్కా.. తెలంగాణలో  వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమే: రేవంత్​రెడ్డి
  • ధరణి పేరుతో నిజాం వారసుల భూములు చేతులు మారినయ్​
  • పోర్టల్​ను రద్దు చేస్తామంటే కేసీఆర్​కు దు:ఖం వస్తున్నది
  • నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి..
  • ప్రగతిభవన్​ను అంబేద్కర్​ భవన్​గా మారుస్తం
  • కాంగ్రెస్​ పాలనలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది
  • బీజేపీకి 110 సీట్లలో డిపాజిట్లు కూడా రావు
  • ఎస్సీ వర్గీకరణ పేరిట ఆ పార్టీ  కాలయాపన చేస్తున్నది.. ఆర్డినెన్స్​ తెస్తే మద్దతిస్తం
  • మీట్​ ది ప్రెస్​లో పీసీసీ చీఫ్​ వ్యాఖ్యలు

రాష్ట్రంలో హంగ్​ వచ్చే సమస్యే లేదని, దానిపై చర్చే అక్కర్లేదని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ పార్టీ 80 నుంచి 85 సీట్లు గెలుస్తుందని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. కేసీఆర్​ అసలు ఉద్యమకారుడే కాదని, ఫక్తు రాజకీయ నాయకుడని విమర్శించారు. ‘‘నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి పడుతుంది. తెలంగాణ ప్రజలు వారికి ఓటమి రుచి చూపించబోతున్నరు. తెలంగాణ ప్రస్థానాన్ని నిజాం నిరంకుశ పాలన, సమైక్య పాలకుల ఆధిపత్యం, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన విధ్వంసం అని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్​లోని ఓ హోటల్​లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన ‘మీట్​ ది ప్రెస్’​లో రేవంత్​రెడ్డి మాట్లాడారు. 

తెలంగాణలో జరిగిన అన్ని పోరాటాలకు మూలం భూమి అని, తెలంగాణ ఆకలినైనా భరించింది గానీ.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని అన్నారు. ‘‘అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారు. కొట్లాడి రాష్ట్రాన్ని సాధించారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్​ ఆధిపత్య ధోరణితోనే ముందుకు వెళ్లారు’’ అని తెలిపారు. 

‘‘పదేండ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి జరగలేదు. అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపిస్తరు” అని రేవంత్​తెలిపారు. ప్రజలను బానిసలుగా కేసీఆర్​ చూస్తున్నారని, ఆయనను గద్దె దించాల్సిన అవసరం ఉందని అన్నారు. కేసీఆర్​కు రావాల్సిన దానికన్నా ఎక్కువే వచ్చాయని, కానీ తెలంగాణ అమరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలని.. ఈ ఉద్యమం పాలన, అధికారం కోసం కాదని.. ఆత్మగౌరవం కోసమని ఆయన పేర్కొన్నారు. 

ప్రజల ఆకాంక్షే మా మేనిఫెస్టో

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్​కు బాబా సాహెబ్​ అంబేద్కర్​ భవన్​గా మారుస్తామని, తెలంగాణ అమరులను స్వాతంత్ర్యయోధులతో సమానంగా గుర్తిస్తామని రేవంత్​ తెలిపారు. మేనిఫెస్టోనే తమకు భగవద్గీత, ఖురాన్​, బైబిల్​ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షే తమ మేనిఫెస్టో అని తెలిపారు. వారి ఆకాంక్షలను తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు. ప్రజలు ఇచ్చే తీర్పుకు కొలబద్దగా పాలసీ డాక్యుమెంట్​ను ప్రజల ముందుంచామని చెప్పారు. గతంలో కాంగ్రెస్​ నుంచి ఎవరు సీఎంలుగా ఉన్నా ప్రజా దర్బార్​ను నిర్వహించారని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారని రేవంత్​ తెలిపారు. ఆ ఆదర్శాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు. కేసీఆర్​కు ఫెడరల్​ స్ఫూర్తి అనేదే తెలియదని, రాచరిక పాలనను కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ప్రాధాన్యతలుంటాయని చెప్పారు. 60 నెలల్లో కేసీఆర్​ పేదలకు రూ. లక్షా 80 వేలు బాకీ పడ్డారని అన్నారు. 

బీజేపీకి 110 సీట్లలో డిపాజిట్లు కూడా రావు

బీజేపీకి 110 సీట్లలో డిపాజిట్లు కూడా రావని, అలాంటి పార్టీ బీసీని సీఎం చేస్తామనడం ఓబీసీలను అవమానించడమేనని రేవంత్​ పేర్కొన్నారు. కేసీఆర్​ను ఓడించాలని బీసీలు కసితో ఉన్నారని అన్నారు. ఆ ఓట్లను చీల్చి కేసీఆర్​కు సహకరించడమే బీజేపీ వ్యూహమని ఆయన ఆరోపించారు. ‘‘ఎస్సీ వర్గీకరణపై గతంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి వంద రోజుల్లో చేస్తమన్నరు. కానీ, ఇప్పటికీ అతీగతీ లేదు. బిల్లు పెడితే మద్దతిస్తామని కాంగ్రెస్​ చెప్తున్నా.. బీజేపీ ఎందుకు బిల్లు పెట్టడం లేదు” అని ప్రశ్నించారు.  దళితుల ఓట్లు కాంగ్రెస్​కు రాకుండా చీల్చేందుకే కమిటీతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మంద కృష్ణ వస్తే కలిసి ఢిల్లీకి వెళ్దామని, మోదీని కలిసి ఆర్డినెన్స్​కు డిమాండ్​ చేద్దామని ఆయన అన్నారు. ఆ ఆర్డినెన్స్​కు తాను మద్దతు ఇస్తానని తెలిపారు. అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి ఆర్డినెన్స్​ ఇవ్వాలని మోదీని కోరుదామని అన్నారు. ప్రభుత్వం అనుకుంటే 48 గంటల్లోనే ఆర్డినెన్స్​ ఇవ్వొచ్చని చెప్పారు.  

బోర్డు రద్దు చేశాకే పరీక్షలు

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నియామక పరీక్షలన్నీ లోపభూయిష్టంగానే జరిగాయని రేవంత్​ అన్నారు. ‘‘పేపర్​ లీకేజీలు జరిగాయి. టీఎస్​పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చెయ్యాలని సాక్షాత్తూ హైకోర్టు చెప్పింది. మేం అధికారంలోకి వస్తే మొదట టీఎస్​పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తాం. చట్టబద్ధంగా కొత్త బోర్డును నియమిస్తాం. అర్హులైన వారినే బోర్డులో నియమిస్తాం. అన్నీ అధ్యయనం చేశాకే వివాదాల్లేకుండా నియామకాలను చేపడతాం. జాబ్​ క్యాలెండర్​లో హామీ ఇచ్చినట్టు ఏడాదిలోగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం’’ అని ఆయన తెలిపారు. టీఎస్​పీఎస్సీ వ్యవహారంలో సిట్​ విచారణ సరిగా లేదని అన్నారు. 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ తాను కక్షపూరితంగా వ్యవహరించలేదని చెప్పారు. ప్రజలు అధికారం ఇచ్చేది పగ తీర్చుకోవడానికి కాదని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికని ఆయన పేర్కొన్నారు. 

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఎస్​ఎల్బీసీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నక్సలైట్ల ఎజెండాను అమలు చేసిందే కాంగ్రెస్​ పార్టీ అని, ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటామని ఆయన అన్నారు. ‘‘కాంగ్రెస్​పాలనలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. కేసీఆర్​ పాలనలా నిర్బంధాలు ఉండవు. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడమే కాంగ్రెస్​ విధానం. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో పోటీ పడేలా చర్యలు తీసుకుంటాం. కేసీఆర్​లాగా ఉన్న వాటిని కూలగొట్టి కొత్తవాటిని కట్టే విధానాలకు కాంగ్రెస్​ స్వస్తి పలుకుతుంది. ఎఫ్​ఆర్​బీఎం నిబంధనలకు అనుగుణంగానే బడ్జెట్​ను ఖర్చు చేస్తాం. అత్యవసరం, నిత్యవసరాలపైనే దృష్టి పెడతాం” అని చెప్పారు. కాంగ్రెస్​లో సీఎం ఎవరనేదానిపై హైకమాండ్​దే తుది నిర్ణయమని రేవంత్​ స్పష్టం చేశారు. 

ధరణి పేరుతో భూ దోపిడీ

రాష్ట్రంలో 24 గంటల కరెంట్​ ఎక్కడా ఇవ్వడం లేదని రేవంత్​ అన్నారు. దీనిపై ఏ సబ్​స్టేషన్​కైనా వెళ్దామని సవాల్​ చేశారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్​ ఇస్తామని స్పష్టం చేశారు. ధరణి పేరుతో భారీ భూదోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్​ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయని, అందుకే ధరణి రద్దు చేస్తామంటేనే కేసీఆర్​కు దు:ఖం వస్తున్నదని అన్నారు. సీఎం హోదాలో అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.