మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలుచేయాలి.. సీపీఎస్ ను రద్దు చేయాలి

మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలుచేయాలి.. సీపీఎస్ ను రద్దు చేయాలి
  •  పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
  • ఇంజినీరింగ్ స్టూడెంట్లకు, టీచర్లకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు

సిద్దిపేట, వెలుగు : కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి, మేనిఫెస్టోలో సైతం పెట్టి ఇప్పుడు పట్టించుకోవడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గురువారం రాత్రి సిద్దిపేటలో నిర్వహించిన సీపీఎస్ ఉద్యోగుల జన జాగరణ యాత్ర చైతన్య సభలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదని, ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అని, వారికి అప్లికేషన్లు కూడా నింపడం రాదు అనడమంటే టీచర్లను అవమానించడమేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మాటలను వెనక్కి తీసుకుని ఇంజినీరింగ్ స్టూడెంట్లకు, టీచర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ స్కూళ్లు గ్రాంట్లు లేవని, స్కావెంజర్లకు జీతాలు, పిల్లలకు యూనిఫామ్స్ అందడం లేదని, ఎంఈఓ, డీఈఓ పోస్టులు భర్తీ చేయడం లేదని, బ్రేక్ ఫాస్ట్ సక్రమంగా అమలు జరగడం లేదన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలనేది ఉద్యోగుల న్యాయమైన డిమాండేనని, అధికారంలోకి వచ్చి 32 నెలలు గడిచినా పాత పెన్షన్ విధానంపై చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. పాత పెన్షన్ విధానం కోసం అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా,  2.60 లక్షల మంది ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేరేలా కృషి చేస్తుందని చెప్పారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, జిల్లా అధ్యక్షుడు దేవరాజ్ పాల్గొన్నారు. 
ఆయిల్ పామ్ సాగుపై సమీక్ష
నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీతో పాటు నియోజకవర్గంలో సాగు విస్తీర్ణంపై ఆయిల్ ఫెడ్, అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఎమ్మెల్యే హరీశ్ రావు తన క్యాంప్ క్యాంప్ ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీ 50 వేల టన్నులు క్రషింగ్ చేసి మరో మైలురాయి కి చేరిందన్నారు. సిద్దిపేట జిల్లాలో అయిల్ పామ్ సాగు పెంచాలని, ఇందుకు అయిల్ ఫామ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు సమన్వయంతో రైతులకు అందుబాటులో ఉంటూ అవగాహన కల్పించాలని సూచించారు.