
- 24 గంటల్లో నిర్ణయం ఉంటుందన్న కాంగ్రెస్ ముఖ్యనేత
- సోనియాగాంధీ ఆమోదమే తరువాయి
- మునుగోడు అంశంపై ఢిల్లీలో నేతల మీటింగ్
- కేసీ వేణుగోపాల్, మాణిక్కం, రేవంత్, భట్టి,
- జానా, ఉత్తమ్, వెంకట్‌రెడ్డి హాజరు
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై వేటు వేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ చీఫ్ సోనియాగాంధీ గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నామని, 24 గంటల్లో ఆయనను సస్పెండ్ చేసే అవకాశం ఉందని ముఖ్యనేత ఒకరు తెలిపారు. సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో మునుగోడు అంశంపై సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు నల్గొండ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. రాత్రి ఎనిమిది తర్వాత అరగంటపాటు సమావేశమై చర్చించారు. ఏఐసీసీ తరఫున పార్టీ వ్యవహారాలను చూస్తున్న ఒక ముఖ్యనేతను ఇదే అంశంపై సంప్రదించగా.. 24 గంటల్లో ఒక నిర్ణయం వస్తుందని, అంతవరకు వేచి చూడాలని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డితో సంప్రదింపులు జరిపే బాధ్యతను పార్టీ నాలుగు రోజుల కిందట సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు అప్పజెప్పింది.
రాజగోపాల్‌కు దిగ్విజయ్ ఫోన్ చేసినా స్పందించలేదు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి శనివారం రాజగోపాల్‌ను హైదరాబాద్‌లో వ్యక్తిగతంగా కలిసి పార్టీలో కొనసాగాలని అడిగారు. అయితే అప్పుడు కూడా ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదు. సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో నేతలు ఇదే విషయంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా రాజగోపాల్‌రెడ్డి వ్యవహార శైలి కూడా కాంగ్రెస్‌లో కొనసాగేలా లేదని, బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగానే ఉందని కాంగ్రెస్ ముఖ్యనేతలు భావిస్తున్నారు. ఈ విషయాలన్నింటిపైన ఢిల్లీలో చర్చించిన నేతలు.. రాజగోపాల్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఎక్కువ మంది వేటు వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది.
భేటీకి హాజరైన అన్న వెంకట్‌రెడ్డి
మునుగోడు అంశంపై ఢిల్లీలో జరిగిన భేటీలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిఅన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. గతంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరు కాలేదు. వెంకట్‌రెడ్డి కూడా తన తమ్ముడి విషయంలో ఇంకా తానేమీ చేయలేనని చేతులెత్తేసినట్లు తెలిసింది. నిర్ణయాన్ని తన తమ్ముడు మార్చుకుంటారని అనిపించడం లేదని ఆయన అన్నట్లు సమాచారం. దాంతో ఈ పరిస్థితులను సోనియాగాంధీకి వివరించి తుది నిర్ణయం ఆమెకే వదిలేయాలని సమావేశంలో నేతలు నిర్ణయానికి వచ్చినట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది.
ఉప ఎన్నిక వస్తే ఎదుర్కోగలమా?
రాజగోపాల్ వ్యవహారం కారణంగా మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ఎదుర్కోగలమా అనే అంశంపై కూడా ఢిల్లీ సమావేశంలో నేతలు చర్చించినట్లు తెలిసింది. పార్టీని రాజగోపాల్ వీడడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చిన నేతలు.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తే బాగుంటుందా, లేక షోకాజ్ నోటీసు జారీ చేసి కొద్ది రోజులు వెయిట్ చేద్దామా అనే దానిపైనా సమాలోచనలు జరిపినట్లు సమాచారం. నిర్ణయాన్ని వాయిదా వేయడం వల్ల ఉప ఎన్నిక రాకుండా జాప్యం చేయగలమా అనే అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఏం చేసినా అంతిమంగా రాజగోపాల్ తన భవిష్యత్ కార్యాచరణపై తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుందని, ఆయన నిర్ణయం స్పష్టంగా తెలుస్తున్నందున సస్పెండ్ చేయడానికే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు సమాచారం.
ఎవరు పోటీ చేయాలి?
మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే ఎవరు పోటీ చేయాలనే విషయం కూడా భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జానారెడ్డిని ఈ విషయమై అభిప్రాయం కోరగా.. తాను, తన కుటుంబం ఈ ఎన్నికలను ఎదుర్కొనే మూడ్‌లో లేమని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎన్నికల ఇన్చార్జ్గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉండాల్సిందిగా వేణుగోపాల్ అడిగితే దాన్ని ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారానికి తాను దూరంగా ఉండదల్చుకున్నానని, పార్టీకి ఎలాంటి సేవలకైనా సిద్ధమేనని, ఈ ఒక్క విషయంలో తనను బలవంతం చేయవద్దని వెంకట్‌రెడ్డి అన్నట్లు సమాచారం. దీంతో వేరే పార్టీ నుంచి ఎవరైనా వస్తారా అనే అంశంపై కూడా భేటీలో మాట్లాడినట్లు తెలిసింది.
రెండు మూడ్రోజుల్లో నిర్ణయం: భట్టి
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రం మునుగోడు వ్యవహారంపై సమగ్రమైన ఆలోచన చేసి రెండు మూడు రోజుల్లో మీడియాకు వివరాలు వెల్లడిస్తామన్నారు. భేటీలో ఈ అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగిందని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కూడా చర్చ జరిపామన్నారు. పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ తయారుచేసిందని, దాన్ని కూడా త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.