
- జీఎస్టీ నిధుల పంపిణీలో కేంద్రం అన్యాయంపై కాంగ్రెస్ ట్వీట్
- ఢిల్లీ దర్బార్’ పేరుతో వీడియో రిలీజ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ 'ఢిల్లీ దర్బార్' పేరుతో కాంగ్రెస్ పార్టీ మరో వీడియోను విడుదల చేసింది. జీఎస్టీ నిధుల పంపిణీలో గుజరాత్ రాష్ట్రానికి ఎక్కువ శాతం నిధులు ఇస్తూ.. తెలంగాణకు తక్కువ కేటాయిస్తూ అన్యాయం చేస్తున్న అంశంపై వినూత్నంగా వీడియో రూపొందించి గురువారం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చినట్లు వీడియోలో చూపెట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. “ సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అంటే ఇదేనేమో.. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుని, గుజరాత్ కు అప్పనంగా అప్పజెప్తున్నది ఢిల్లీ దర్బార్. తెలంగాణ అడిగింది పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా.. బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కృష్ణా గోదావరిలో వాటాల పంపకం, మేడారం జాతరకు జాతీయ హోదా అడిగితే.. గాడిద గుడ్డు ఇచ్చింది’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.