
హైదరాబాద్, వెలుగు: రెబెల్స్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ కసరత్తు షురూ చేసింది. పార్టీ ఓట్లు చీలకుండా చర్యలకు ఉపక్రమించింది. టికెట్దక్కక రెబెల్స్‌గా నామినేషన్లు వేసిన 12 మంది పార్టీ అభ్యర్థులను మంగళవారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పిలిపించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ ఇన్చార్జ్ సెక్రటరీ పీసీ విష్ణునాథ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్వారితో చర్చలు జరిపారు.
పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో ఇలా రెబెల్స్‌గా బరిలోకి దిగితే పార్టీకి నష్టం జరుగుతుందని వారికి సర్ది చెప్పారు. అధికారంలోకి వచ్చాక పదవులు ఇస్తామని, నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బుజ్జగించారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారమే చివరి రోజు కావడంతో అందరితోనూ పార్టీ నేతలు మాట్లాడారు. అందులో ఒక్క పటేల్ రమేశ్ రెడ్డి తప్ప దాదాపు అందరూ నామినేషన్లను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించినట్టు తెలిసింది. కొందరు నేతలు మంగళవారమే తమ నామినేషన్లను వెనక్కు తీసుకున్నారు.
కలిసి పనిచేస్తమని హామీ
పార్టీ నేతల బుజ్జగింపులతో దాదాపు అందరు నేతలు ప్రస్తుత అభ్యర్థులతో కలిసి పనిచేస్తామని చెప్పినట్టు తెలిసింది. నర్సాపూర్ నుంచి రెబెల్ గానామినేషన్ వేసిన గాలి అనిల్‌కుమార్.. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ఆంజనేయులు గౌడ్, పార్టీ శ్రేణులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు. ఇక నెహ్రూనాయక్‌తో రామసహాయం సురేందర్ రెడ్డి చర్చలు జరిపారు. ఆయన కూడా కొంచెం తగ్గినట్టు తెలుస్తున్నది.
సిరిసిల్ల నుంచి రెబెల్‌గా నామినేషన్ వేసిన ఉమేశ్ రావు కూడా.. కేకే మహేందర్ రెడ్డితో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు. మాణిక్ రావు ఠాక్రే, పీసీ విష్ణునాథ్ఆయనతో మాట్లాడారు. మహేశ్ కుమార్ గౌడ్ సూచనలతోనూ ఉమేశ్ రావు తన నామినేషన్‌ను వెనక్కు తీసుకుంటానని చెప్పినట్టు సమాచారం.
12 నియోజకవర్గాల్లో రెబెల్స్..
కాంగ్రెస్ ప్రకటించిన 118 మంది అభ్యర్థుల్లో 12 చోట్ల రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేశారు. సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్ రెడ్డి నామినేషన్ వేశారు. అక్కడ దామోదర్ రెడ్డికి టికెట్ ప్రకటించడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆదిలాబాద్ నుంచి సంజీవ్ రెడ్డి నామినేషన్ వేయగా.. ఆయనకు సాజిద్‌ఖాన్, గండ్రత్ సుజాత మద్దతుగా నిలిచినట్టు చెప్తున్నారు. బోథ్‌లో తొలుత వెన్నెల అశోక్‌కు టికెట్ ప్రకటించి ఆ తర్వాత మార్చారు.
ఈ నేపథ్యంలోనే వెన్నెల అశోక్ కూడా రెబెల్‌గా నామినేషన్ వేశారు. వరంగల్ వెస్ట్ నుంచి జంగా రాఘవరెడ్డి నామినేషన్ వేయగా.. ఈసీ తిరస్కరించింది. వైరా నుంచి విజయా బాయి, నర్సాపూర్ నుంచి గాలి అనిల్ కుమార్, ఇబ్రహీంపట్నం నుంచి దండెం రాంరెడ్డి, డోర్నకల్ నుంచి నెహ్రూ నాయక్, పాలకుర్తి నుంచి లక్ష్మణ్ నాయక్, సుధాకర్ గౌడ్, జుక్కల్ నుంచి సౌదాగర్ గంగారాం, బాన్సువాడ నుంచి కాసుల బాలరాజు, సిరిసిల్ల నుంచి ఉమేశ్ రావు రెబెల్స్‌గా నామినేషన్లు వేశారు.
రాహుల్ గాంధీతో మాట్లాడించేందుకు..
రెబెల్స్ దాదాపు దిగివస్తున్నా.. పటేల్రమేశ్ రెడ్డి మాత్రం బుజ్జగింపులకు తగ్గేదే లేదు అంటున్నారు. తాను పోటీ నుంచి వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సూర్యాపేటలో ఇంటింటి ప్రచారం చేస్తున్న ఆయన.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. టికెట్లు అనౌన్స్మెంట్ తర్వాతి నుంచి కనీసం రేవంత్ రెడ్డి మాట్లాడలేదని ఆయన వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని తన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అంటున్నారు. కార్యకర్తల విజ్ఞప్తి మేరకే బరిలో ఉంటున్నానని చెప్పారు. సింహం గుర్తుతో బరిలోకి దిగుతున్నానని స్పష్టం చేస్తున్నారు. వంద శాతం తానే గెలుస్తానని, గెలిచి సోనియాకు గిఫ్ట్ ఇస్తానని పేర్కొన్నారు. గెలిచి మళ్లీ పార్టీలైన్లోకే వస్తానంటున్నారు. ఆయన మొండిపట్టు పడుతున్నా.. రాహుల్ గాంధీతో మాట్లాడించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.