
దేశంలో కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు భద్రతా వ్యవస్థ, శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమైనవని ప్రధాని మోడీ అన్నారు ..మే 10న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బళ్లారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు కోసం ఉగ్రవాదానికి లొంగిపోయిందని మోడీ ఆరోపించారు. అలాంటి పార్టీ కర్ణాటకను కాపాడగలదా అని మోడీ ప్రశ్ని్ంచారు.
యడ్యూరప్ప, బొమ్మై నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి మూడున్నరేళ్లు మాత్రమే ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని మోడీ తెలిపారు. మరోసారి బీజేపీకి కన్నడ ప్రజలు అధికారాన్ని ఇవ్వాలని, దేశంలో కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి బదులు అవినీతికి ప్రాధాన్యత ఇచ్చిందని మోడీ ఆరోపించారు.
కాంగ్రెస్ గెలుపు కోసం తప్పుడు కథనాలు, సర్వేలు చేస్తుందని, రాష్ట్రంలోని ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా బుజ్జగింపుల గురించి, నిషేధాల గురించి ఉందని ఎద్దెవా చేశారు . స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ రాజకీయాలతో పాటు వ్యవస్థలను భ్రష్టు పట్టించేందుకు కాంగ్రెస్ కృషి చేసిందని మోడీ ఆరోపించారు.