మే నెలలో హైదరాబాద్​ సరూర్​నగర్​లో కాంగ్రెస్​ భారీ బహిరంగ సభ

మే నెలలో హైదరాబాద్​ సరూర్​నగర్​లో కాంగ్రెస్​ భారీ బహిరంగ సభ
  • హైదరాబాద్​లోని సరూర్​నగర్​లో నిర్వహిస్తం..
  • ప్రియాంకా గాంధీ వస్తరు
  • పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీపై వరుసగా నిరుద్యోగ నిరసన దీక్షలు చేపడ్తామని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ప్రకటించారు. ఈ నెల 21న నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్​లో దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మే 4 లేదా 5న హైదరాబాద్​ సరూర్​నగర్​లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ సభకు ప్రియాంకా గాంధీ ముఖ్య అతిథిగా వస్తారని చెప్పారు. ఎల్బీననగర్​లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించి, భారీ ర్యాలీగా సరూర్​నగర్​ స్టేడియానికి చేరుకుంటామన్నారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఈ సభలో యువతకు వివరిస్తామని తెలిపారు. కర్నాటక ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ బిజీగా ఉన్నారని, అక్కడి నుంచి హైదరాబాద్​కు వస్తారని, ఆమె పర్యటనపై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్​లో మీడియాతో రేవంత్​ మాట్లాడారు. మే 9 నుంచి తన రెండో విడత ‘హాత్​ సే హాత్​ జోడో యాత్ర’ను జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభిస్తానని చెప్పారు. 

పేపర్ల లీకేజీ కేసును సీబీఐతో విచారణ జరిపించాలి

‘‘ఇంటికో ఉద్యోగమిస్తామంటూ హామీ ఇచ్చిన కేసీఆర్​.. కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ, తన ఇంట్లో మాత్రం నాలుగైదు ఉద్యోగాలిచ్చుకున్నడు” అని రేవంత్​ మండిపడ్డారు. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ పాపం సర్కార్​దేనని అన్నారు. కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. ఈ కేసులో చిన్న ఉద్యోగులను ఇరికించి అసలు నిందితులను తప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అధికారులు ఈ కేసును విచారిస్తే అసలు నిజాలు బయటకు రావని, ప్రభుత్వంలోని పెద్దలను కాపాడుకునేందుకే ప్రతి కేసులోనూ రాష్ట్ర సర్కారు సిట్​ వేస్తున్నదని విమర్శించారు. పేపర్​ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్​ను బర్తరఫ్​ చేయాలని, కమిషన్​పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గవర్నర్​ను కోరామని, అయినా గవర్నర్​ చర్యలు తీసుకోలేదని అన్నారు. తమ పోరాటం వల్లే కేసును ఈడీ విచారిస్తున్నదని ఆయన  పేర్కొన్నారు.  నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తు చేశారు. ఆ నినాదంతో ఎంతో మంది యువతీ యువకులు ఉద్యమిస్తేనే రాష్ట్రం వచ్చిందని, కానీ, సాధించుకున్న రాష్ట్రంలోనే ఇప్పుడు యువత సమిధగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

రేస్​ కోర్స్​ రోడ్డులో సంజయ్​ ర్యాలీ తియ్యాలి

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ విఫలమయ్యారని విమర్శించారు. ‘‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి మోడీ అధికారంలోకి వచ్చారు. ఈ లెక్కన ఇప్పటిదాకా 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. కానీ, మాటను నిలబెట్టుకోకుండా మోడీ మోసం చేశారు’’ అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన రోజే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ బండి సంజయ్​ అంటున్నారని, ఆయన మాటలు వింటే నవ్వాల్నో.. ఏడ్వాల్నో తెలియడం లేదని రేవంత్​ విమర్శించారు.

టెన్త్​ పేపర్​ లీక్​ కేసులో అరెస్టయిన సంజయ్​ ఆ మరుసటి రోజే విడుదలయ్యారని, కానీ, నిరుద్యోగుల కోసం పోరాడుతున్న కాంగ్రెస్​ లీడర్లను మాత్రం ఐదు రోజులు జైల్లో ఉంచారని అన్నారు. ‘‘లీకుల్లో ఇరుక్కున్న సంజయ్​ నిరుద్యోగ నిరసన ర్యాలీలు తీస్తున్నరు. నిజంగా సంజయ్​కి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ప్రధాని నివాసముండే రేస్​కోర్స్​ రోడ్డులో నిరసన ర్యాలీ తియ్యాలి” అని రేవంత్​ సవాల్​ విసిరారు. ‘‘హైదరాబాద్​లో వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామంటూ హామీ ఇచ్చిన సంజయ్​.. ఆ తర్వాత ఆ ముచ్చట్నే పట్టించుకోలేదు. ఆ హామీతో జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందారు..  ఆ తర్వాత ఇన్సూరెన్స్​ ఉంది కదా అంటూ దాటవేశారు” అని దుయ్యబట్టారు.