డీసీసీ చీఫ్‌లు.. 33 జిల్లాలు, 3 కార్పొరేషన్లకు 36 మంది పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్

డీసీసీ చీఫ్‌లు.. 33 జిల్లాలు, 3 కార్పొరేషన్లకు 36 మంది పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
  • సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మాత్రం పెండింగ్
  • ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ కార్పొరేషన్  చైర్​పర్సన్​కు అవకాశం
  • గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినోళ్లకు, యువత, మహిళలకు చాన్స్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లకు కొత్త అధ్యక్షులను ఆ పార్టీ హైకమాండ్ నియమించింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్ సహా 33 జిల్లాలు, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లకు కలిపి మొత్తం 36 మంది పేర్లను ప్రకటించింది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలను మాత్రం పెండింగ్‌‌లో పెట్టింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ శనివారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణతో పాటు రాజస్థాన్ డీసీసీ అధ్యక్షుల జాబితాను రిలీజ్ చేశారు.

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాల మేరకు నియామకాలు చేపట్టామని, ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా, ‘సంఘటన్ సృజన్ అభియాన్‌‌’లో భాగంగా ఈ నియామకాలు చేపట్టినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ప్రతి జిల్లాకు అబ్జర్వర్లను పంపించి, వారిచ్చిన నివేదికతో పాటు.. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, పార్టీ రాష్ట్ర ఇన్‌‌చార్జ్‌‌తో చర్చించి నియామకాలు చేపట్టినట్టు పేర్కొన్నాయి.

పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్న అధిష్టానం.. ఆ దిశలో సమర్థులని భావించిన నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఆయా జిల్లాల్లో ఆ నేతల అవసరం, పరిస్థితులను పరిగణలోకి తీసుకొని నియామకాలు చేపట్టింది. ఐదుగురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ ఒకరికి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం కల్పించింది. అలాగే గత అసెంబ్లీ, లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు చాన్స్ ఇచ్చింది.

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు యాదాద్రి భువనగిరి జిల్లా బాధ్యతలు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు నాగర్ కర్నూల్ జిల్లా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు  నిర్మల్ జిల్లా, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెద్దపల్లి జిల్లా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించింది. అలాగే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్) చైర్మన్ శివసేనా రెడ్డికి వనపర్తి జిల్లా బాధ్యతలు ఇచ్చింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వజ్రేశ్ యాదవ్​కు మేడ్చల్, ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఓటమిపాలైన ఆత్రం సుగుణకు ఆసిఫాబాద్ జిల్లాలు అప్పగించింది. లకావత్ ధన్వంతికి జనగామ డీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌గా అవకాశం కల్పించింది. 

ఐదుగురు మహిళలు..  
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీసీసీ అధ్యక్ష బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్ యువ నాయకులకు అప్పగించింది. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా, సికింద్రాబాద్ అధ్యక్షుడిగా కె.దీపక్ జాన్, ఖైరతాబాద్ అధ్యక్షుడిగా మోత రోహిత్ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా వజ్రేశ్ యాదవ్‌‌‌‌‌‌‌‌ను నియమించింది. అలాగే ఉస్మానియా విద్యార్థి నేత పున్న కైలాశ్‌‌‌‌‌‌‌‌కు నల్గొండ పగ్గాలు అప్పగించింది. వీరితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ను నియమించింది. కాగా, మొత్తం 36 మంది డీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌లలో ఐదుగురు మహిళలకు చోటు దక్కింది. వీరిలో ఆత్రం సుగుణ, తోట దేవి ప్రసన్న, లకావత్ ధన్వంతి, భూక్య ఉమ, తూముకుంట ఆంక్ష రెడ్డి ఉన్నారు. 

డీసీసీ అధ్యక్షులు వీళ్లే.. 
ఆదిలాబాద్ – నరేశ్ జాదవ్, ఆసిఫాబాద్ – ఆత్రం సుగుణ, భద్రాద్రి కొత్తగూడెం – తోట దేవి ప్రసన్న, భువనగిరి – బీర్ల ఐలయ్య, గద్వాల – ఎం.రాజీవ్ రెడ్డి, హనుమకొండ – ఎంగాల వెంకట్ రామ్ రెడ్డి, హైదరాబాద్ – సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా, జగిత్యాల – గజంగి నందయ్య, జనగామ – లకావత్ ధన్వంతి, జయశంకర్ భూపాలపల్లి – బట్టు కరుణాకర్, కామారెడ్డి – మల్లికార్జున్ ఆలే, కరీంనగర్ – మేడిపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్ – వి.అంజన్ కుమార్, ఖైరతాబాద్ – మోత రోహిత్ ముదిరాజ్, ఖమ్మం – నూతి సత్యనారాయణ, ఖమ్మం కార్పొరేషన్ – దీపక్ చౌదరి, మహబూబాబాద్ –  భుక్య ఉమ, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ – ఎ.సంజీవ్ ముదిరాజ్, మంచిర్యాల – పిన్నింటి రఘునాథ్ రెడ్డి, మెదక్ – శివన్నగారి ఆంజనేయులు గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరి – తోటకూర వజ్రేశ్ యాదవ్, ములుగు – పైడాకుల అశోక్, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ – చిక్కుడు వంశీకృష్ణ, నల్గొండ – పున్న కైలాశ్ నేత, నారాయణపేట – కొల్లుకుదురు ప్రశాంత్ కుమార్ రెడ్డి, నిర్మల్ – వెడ్మ బొజ్జు, నిజామాబాద్ – కట్‌‌‌‌‌‌‌‌పల్లి నాగేశ్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ – బొబ్బిలి రామకృష్ణ, పెద్దపల్లి – ఎంఎస్ రాజ్ ఠాకూర్, రాజన్న సిరిసిల్ల – సంగీతం శ్రీనివాస్, సికింద్రాబాద్ – కె.దీపక్ జాన్, సిద్దిపేట – తూముకుంట ఆంక్ష రెడ్డి, సూర్యాపేట – గుడిపాటి నర్సయ్య, వికారాబాద్ – ధారాసింగ్ జాదవ్, వనపర్తి – కె.శివసేనా రెడ్డి, వరంగల్ – మహ్మద్ అయూబ్