
బెంగళూరు: కర్నాటకలో సీఎంను మార్చుతారనే ప్రచారానికి కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. నాయకత్వ మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కర్నాటక ఇన్‌చార్జ్ రణదీప్ సూర్జేవాలా క్లారిటీ ఇచ్చారు. మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ‘మీరు సీఎం మార్పు గురించే ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారా? వాళ్ల అభిప్రాయాలు తీసుకున్నారా?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘కాదు.. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనేదే లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు గురించి తెలుసుకోవడానికే వాళ్లతో సమావేశమయ్యాను” అని సూర్జేవాలా స్పష్టం చేశారు. ‘‘మా ఎమ్మెల్యేలు గత రెండేండ్లలో ఏమేం పనులు చేశారో తెలుసుకుంటున్నాం. దానికి సంబంధించి రిపోర్టు కార్డు ఇవ్వాలని వాళ్లను కోరాను.
రానున్న వారం రోజుల్లో ఎమ్మెల్యేలందరితోనూ సమావేశమవుతాను. ఆ తర్వాత మంత్రులతోనూ భేటీ అయి వాళ్ల నియోజకవర్గాల్లో చేసిన పనుల గురించి తెలుసుకుంటాను” అని చెప్పారు. అభివృద్ధి పనులు జరగడంలేదన్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో చేయాలనుకుంటున్న పనులను అడిగి తెలుసుకుంటున్నాం.
వాటిని ప్రాధాన్య క్రమంలో పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎవరికేం సమస్య ఉన్నా పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ ప్రస్తావించి పరిష్కరించుకోవాలని మా ఎమ్మెల్యేలకు సూచించాను” అని తెలిపారు. ‘‘ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు ఉన్నాయి. ఐదు గ్యారంటీల అమలును ఆపే ప్రసక్తే లేదు. బీజేపీ నేతలది తప్పుడు ప్రచారం” అని మండిపడ్డారు.