- పీసీసీ నుంచి జిల్లా స్థాయి వరకు నేతల పనితీరుపై ఫోకస్
- ప్రతి మూడు రోజుల పార్టీ కార్యక్రమాల నివేదిక ఢిల్లీకి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ అధ్యక్షుడి నుంచి డీసీసీ అధ్యక్షుల వరకు కాంగ్రెస్ నేతల పనితీరుపై హైకమాండ్ నిఘా పెట్టింది. పార్టీ కార్యక్రమాల అమలు, నేతల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది. హైకమాండ్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేయని ముగ్గురు డీసీసీ అధ్యక్షులను తొలగించాలని ఢిల్లీ నుంచి తనకు నేరుగా ఆదేశాలు వచ్చినట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ‘గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు హైకమాండ్ లేదు. నేతల పనితీరును పర్యవేక్షించేందుకు ఏఐసీసీలో పెద్ద వ్యవస్థ పనిచేస్తున్నది. ప్రతి మూడు రోజుల పార్టీ కార్యక్రమాల వివరాలను డీసీసీ అధ్యక్షులు నివేదిక రూపంలో ఢిల్లీకి పంపించాలి. అలా పంపించకపోతే హైకమాండ్ నుంచి నేరుగా వారి మొబైల్‌కు మెసేజ్ వస్తున్నది’ అని ఆయన వివరించారు.
పార్టీలో ఏ స్థాయి నేతలైనా హైకమాండ్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు హైకమాండ్‌కు నివేదికలు పంపిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని మహేశ్ గౌడ్ చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయి చైర్మన్ పదవులతో పాటు పలు డైరెక్టర్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై పార్టీలో ఇంకా చర్చ జరగలేదన్నారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జులు, స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. నల్గొండ–ఖమ్మం–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించిన వ్యక్తని పేర్కొన్నారు.
