యూత్‌‌ ఒలింపిక్స్‌‌ ఫైనల్లోకి తానియా.. బీచ్‌‌ రెజ్లింగ్‌‌లో గోల్డ్ మెడల్‎పై గురి

యూత్‌‌ ఒలింపిక్స్‌‌ ఫైనల్లోకి తానియా.. బీచ్‌‌ రెజ్లింగ్‌‌లో గోల్డ్ మెడల్‎పై గురి

డాకర్‌‌: యూత్‌‌ ఒలింపిక్స్‌‌లో భారత రెజ్లర్‌‌ తానియా సత్తా చాటింది. మహిళల 75 కిలోల బీచ్‌‌ రెజ్లింగ్‌‌ విభాగంలో వరుసగా నాలుగు విజయాలు సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో స్వర్ణ పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన పోటీల్లో అజేయంగా నిలిచిన తానియా.. టైటిల్‌‌ పోరులో చైనాకు చెందిన జావో మిన్‌‌తో తలపడనుంది. క్వార్టర్‌‌ ఫైనల్లో ఎస్టోనియాకు చెందిన మెరిలీ వెస్టర్‌‌ను 4–-1తో ఓడించింది. సెమీఫైనల్లో అమెరికా రెజ్లర్‌‌ మాటిల్డా ఆన్‌‌ హ్రూబీపై 3–1తో గెలిచి ఫైనల్‌‌ బెర్తును ఖరారు చేసుకుంది. 

నాలుగు బౌట్లలోనూ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా విజయం సాధించడం విశేషం. కాగా, బీచ్‌‌ రెజ్లింగ్‌‌ తొలిసారిగా 2026 డాకర్‌‌ యూత్‌‌ ఒలింపిక్స్‌‌లో ప్రవేశపెట్టారు. ఇసుకపై ఏడు మీటర్ల వృత్తాకార ప్రదేశంలో జరిగే ఈ పోటీలో ఒక్కో బౌట్‌‌ గరిష్ఠంగా మూడు నిమిషాల పాటు సాగుతుంది. మూడు పాయింట్లు సాధించినా, ప్రత్యర్థిని నిర్ణయాత్మకంగా వెనుకకు పడేసినా విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఫైనల్లో చైనా ప్రత్యర్థిని ఓడించి స్వర్ణం సాధించడంపై తానియా గురిపెట్టింది.