మధ్యప్రదేశ్పై కాంగ్రెస్ కర్నాటక ఫార్ములా.. వ్యూహాన్ని మార్చుకున్న బీజేపీ

మధ్యప్రదేశ్పై కాంగ్రెస్ కర్నాటక ఫార్ములా.. వ్యూహాన్ని మార్చుకున్న బీజేపీ

కర్నాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మిగతా రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ఆ పార్టీ అన్ని వ్యూహాలు రచిస్తోంది. కర్నాటకలో అమలు చేసిన పథకాలు, వ్యూహరచన మధ్యప్రదేశ్ లోనూ అమలుకు ప్లాన్ చేస్తోంది. బీజేపీ పార్టీ తరచూ విమర్శలు ఎక్కుపెడుతోంది. మధ్యప్రదేశ్‌లో కూడా కర్ణాటక తరహాలోనే అదే ఫార్ములాను ఉపయోగించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అధికార పార్టీ బీజేపీ ఎన్ని హామీలు గుప్పించినా తమదే విజయమని హస్తం పార్టీ ధీమాతో ఉంది. అయితే.. కాంగ్రెస్ కొత్త పంథాను ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ మారింది. 

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జూన్‌ 12వ తేదీన నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా హామీల వర్షం కురిపించారు. తాము ఇచ్చిన హామీలు 100 శాతం నెరవేరుస్తామన్నారు. కర్ణాటక ప్రజలకు ఇదేవాగ్దానం చేశామని, అక్కడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లును ఆమోదించిందని ప్రియాంక అన్నారు.

మహిళలకు ప్రతినెలా రూ.15 వందలు,  రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 100 యూనిట్ల విద్యుత్‌ ఉచితం, 200 యూనిట్ల ధర సగానికి తగ్గింపు వంటివి అమలు చేస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పేద రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామన్నారు. 

ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా రణదీప్ సుర్జేవాలాను నియమించారు. సుర్జేవాలా గతంలో కాంగ్రెస్‌కు కర్ణాటక ఇన్ చార్జ్‌గా ఉన్నారు. మరోవైపు..  కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు.. మధ్యప్రదేశ్‌లో కూడా  కర్నాటక తరహాలో ఫలితాలను తీసుకురావడానికి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచారంలో అప్పటి అధికార పార్టీపై 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని ఆరోపించగా.. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ పార్టీ 50శాతం కమీషన్ అని ఆరోపించారు దిగ్విజయ్ సింగ్.

కాంగ్రెస్ వ్యూహాలను పసిగట్టిన బీజేపీ.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌పై దాడి చేయడానికి కొత్త పద్ధతులను ఎంచుకుంటోంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత, మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. మొత్తంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.