కాంగ్రెస్​వి మాయమాటలు.. ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ అమలు చేయలేదు: హరీశ్ రావు

కాంగ్రెస్​వి మాయమాటలు.. ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ అమలు చేయలేదు:  హరీశ్ రావు

కౌడిపల్లి/జీడిమెట్ల, వెలుగు: ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల, చేనేత కార్మికుల, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కల్లు దుకాణాలపై రైడింగ్​లు చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. 

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డితో కలిసి హరీశ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ఏడాది కాంగ్రెస్ పాలనలో ఎంతో మంది గౌడన్నలు తప్పుడు కేసుల్లో జైలు పాలయ్యారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఆలయ నిర్మాణాలు జరిగాయి.

 గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆయన హయాంలోనే బలోపేతమైంది.  రైతు ఖాతాల్లో వెంటనే రైతుబంధు జమ చేయాలి. కాంగ్రెస్ సర్కార్ మాటలు నమ్మొద్దు. ఇప్పటికైనా ప్రజలు బుద్ధి చెప్పాలి. రేవంత్ కంటే తెలంగాణ ప్రజలు తెలివైనోళ్లు. ఇక నుంచి ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మరు. దేవుళ్లపై ఒట్లు వేసి కాలం వెల్లదీస్తున్నడు’’అని హరీశ్ మండిపడ్డారు.

బిల్డర్ ​వేణుగోపాల్ రెడ్డిది ప్రభుత్వ హత్యే

కొంపల్లికి చెందిన బిల్డర్ ముత్యాల వేణుగోపాల్ రెడ్డిది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వం చేసిన హత్య అని హరీశ్ అన్నారు. జనవరి 29న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న వేణుగోపాల్ రెడ్డి ఫ్యామిలీని ఆదివారం ఆయన పరామర్శించి మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. హైడ్రా పేరుతో హైదరాబాద్​లో భయాందోళనలు సృష్టించారు. 

13 నెలల కాంగ్రెస్ పాలనలో అపార్ట్​మెంట్ అమ్ముడు పోక... బ్యాంకుల్లో అప్పు పుట్టక వేణుగోపాల్ రెడ్డి సూసైడ్ చేసుకున్నాడు. బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి హైదరాబాద్ స్వర్గధామంగా ఉండేది. ఇప్పుడు హైడ్రా కారణంగానే అపార్ట్​మెంట్లు సేల్ కావడం లేదు. ప్రభుత్వం స్పందించి వేణుగోపాల్​రెడ్డి కుంటుంబాన్ని ఆదుకోవాలి’’అని హరీశ్ డిమాండ్ చేశారు.