మునుగోడులో కాంగ్రెస్ గెలవడం ఖాయం

మునుగోడులో కాంగ్రెస్ గెలవడం ఖాయం

తాను సోనియా గాంధీ ఏజెంట్నని.. మిగితా ఎవరికి కాదని కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తెలిపారు. బీజేపీలో చేరిన నేతలు తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పరిణామాలను సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు గమనిస్తున్నారన్న ఆయన..అధిష్టానం ప్రియాంక గాంధీని ఇంచార్జ్ గా నియమిస్తే స్వాగతిస్తామని తెలిపారు. ఒక్క నాయకుడిపై కాంగ్రెస్ ఎప్పుడు ఆధారపడదని.. టీమ్ వర్క్ ను మాత్రమే నమ్ముతుందని తెలిపారు. 

గుజరాత్ ఎన్నికలతో పాటు మునుగోడు ఉపఎన్నిక ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోందని మాణిక్కం ఠాగూర్ తెలిపారు. రానున్న వంద రోజుల్లో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని మాణిక్కం ఠాగూర్ తెలిపారు. ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 175 ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని మాణిక్కం ఠాగూర్ ఖండించారు. ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.