
ములుగు, వెలుగు : దళితబంధు ఒక్క సంవత్సరం మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర జల వనరుల మండలి చైర్మన్ వి.ప్రకాశ్ విమర్శించారు. ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. బుధవారం ములుగులోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రకాశ్ మాట్లాడారు. ములుగులో 2018లో తమ అభ్యర్థి ఓడినా సీఎం కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యే అని చూడకుండా అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశారన్నారు. రాబోయే రోజుల్లో రూ.100 కోట్లు వెచ్చించి రామప్ప, లక్నవరం సరస్సుల పంట కాలువలు, ప్రధాన కాలువలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని, అధికార పార్టీ ఎమ్మెల్యే మళ్లీ గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. బీఆర్ఎస్కు 66 నుంచి 80 సీట్లు వస్తాయని, యువత బీఆర్ఎస్తోనే ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోందని, వారు గెలిస్తే 2లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.