అధికారమే లక్ష్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ బస్సు యాత్ర 

అధికారమే లక్ష్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ బస్సు యాత్ర 

అధికారమే లక్ష్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రణాళిక రచించింది. అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ అందుకు అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రజలతో మమేకం అవుతూ..బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతామని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. రేపు బెలగావిలో బస్సు యాత్రను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రచార ధ్వని క్యాంపెయిన్ లోగోను ఆవిష్కరించారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న కమలనాథులపై డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

2018 ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీల్లో 90శాతానికిపైగా  మర్చిపోయిందని డీకే శివకుమార్ ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. 40శాతం కమీషన్ల ద్వారా విచ్చలవిడిగా దోచుకోవడంలో బీజేపీ బిజీగా మారడంతో కర్ణాటక అభివృద్ధి వెనుకబడిపోయిందన్నారు. 

కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. బీజేపీ అవినీతిని ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్ర చేపట్టామని చెప్పారు. కాంగ్రెస్ బస్సు యాత్ర రెండు గ్రూపులుగా ఏర్పాటయ్యాయని తెలిపారు. ఒక గ్రూపుకు తాను..మరో గ్రూపుకు డీకే శివకుమార్ నాయకత్వం వహిస్తారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 224 నియోజకవర్గాలను కవర్ చేస్తామని చెప్పారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వంపై విసిగిపోయారన్నారు. ద్వేషపూరిత, ప్రతీకార రాజకీయాల కారణంగా ప్రజలు శాంతియుతంగా జీవించలేకపోతున్నారని స్పష్టం చేశారు.దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా కర్ణాటకను రెండో స్థానంలో నిలిచిందని..కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రైతులను తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని ఆరోపించారు.