కాంగ్రెస్ లీడర్ పై పెట్రోల్ దాడి.. మృతి.. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఘటన

కాంగ్రెస్ లీడర్ పై పెట్రోల్ దాడి.. మృతి..     గ్రేటర్ వరంగల్ పరిధిలో ఘటన

వరంగల్ సిటీ, వెలుగు : కాంగ్రెస్ నాయకుడిపై కొందరు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడి, ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రేటర్ వరంగల్ పరిధిలోని 14వ డివిజన్ ఎన్ టీఆర్ నగర్ కు చెందిన కాం గ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్, డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్ (45)కు శనివారం రాత్రి జన్ను మధు అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తర్వాత ఇద్దరూ కలిసి కోటి లింగాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి మద్యం సేవించారు. 

ఇదే సమయంలో పత్తి కుమార్ అనే వ్యక్తి అక్కడికి రావడంతో మహేశ్, కుమార్ మధ్య గొడవ జరిగింది. దీంతో కుమార్ మహేశ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడే ఉన్న మధు మంటలను ఆర్పి బైక్ పై ఇంటికి తీసుకొచ్చాడు. తీవ్రంగా గాయపడ్డ మహేశ్ ను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మహేశ్ చనిపోయాడు. దాడి విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆదివారం ఉదయం హాస్పిటల్ కు వచ్చి మహేశ్ ను పరామర్శించారు.

 ఈ విషయంపై కేసు నమోదు చేసి కుమార్, మధును అదుపులోకి తీసుకోగా.. మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.