బంగారు తెలంగాణ వట్టి బూటకం.. కేసీఆర్ చెప్పేవన్నీ కట్టుకథలు: భట్టి

బంగారు తెలంగాణ వట్టి బూటకం.. కేసీఆర్ చెప్పేవన్నీ కట్టుకథలు: భట్టి
  • ఏ ఒక్క వర్గం బాగుపడలె.. ధరణితో లక్షల మందికి నష్టం 
  • ఉచిత కరెంట్’పై పేటెంట్ తమదేనన్న సీఎల్పీ నేత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందని కేసీఆర్ సర్కార్ కట్టుకథలు చెబుతున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే.. వాటన్నింటినీ బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు, వారి అనుచరులే దోచుకుంటున్నారని ఆరోపించారు. 

బీఆర్ఎస్ దోపిడీ వల్లే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్నారు. సామాజికంగా, ఆర్థికంగా అన్ని వర్గాలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి లేక, ఆదాయం రాక జనం గోస పడుతున్నారని అన్నారు. శనివారం హైదరాబాద్‌‌లోని ఇందిరాభవన్‌‌లో భట్టి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన పాదయాత్ర వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థలను బీఆర్ఎస్ సర్కార్ నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. ‘‘బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్‌‌‌‌లో దళితులకు మూడెకరాల భూమి రాకపోగా.. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో దళితులకు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారు.

గిరిజనులకు పోడు హక్కులు ఇవ్వకపోగా, వాళ్లు ఏండ్లుగా దున్నుకుంటున్న భూములను లాక్కుంటున్నారు. ఆదివాసీలను అడవుల నుంచి తరిమేస్తున్నారు. రాష్ట్రంలో కుమ్మరోళ్లు కుండలు చేసుకునేందుకు కొంచెం మట్టి కూడా తవ్వుకునే పరిస్థితి లేకుండా పోయింది” అని అన్నారు. ‘‘రాష్ట్రంలో ఫ్యూడలిస్ట్, దేశంలో క్యాపిటలిస్ట్ ప్రభుత్వం నడుస్తున్నది. సంపదంతా కొద్ది మంది చేతుల్లోనే పోగుపడుతున్నది. తలసరి ఆదాయం పెరిగిందని కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నరు. 20 మిలియన్ల చదరపు అడుగుల జాగా ఉన్న అమర్నాథ్‌‌ రెడ్డి వంటి వాళ్లు కొందరైతే.. కనీసం 40 గజాల ఇంటి జాగా కోసం ఎదురు చూస్తున్నోళ్లు లక్షల మంది ఉన్నారు. వీళ్లు, వాళ్ల ఆదాయం కలిపి తలసరి ఆదాయంగా చూపిస్తే అందరి ఆదాయం పెరిగినట్టు అవుతుందా?” అని భట్టి ప్రశ్నించారు. 

ధరణి.. దుర్మార్గపు సాఫ్ట్ వేర్ 

ధరణి.. ఓ దుర్మార్గపు సాఫ్ట్‌‌వేర్‌‌ అని భట్టి మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ధరణి స్థానంలో కొత్త సాఫ్ట్‌‌వేర్ తీసుకొస్తామని చెప్పారు. ‘‘బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల లక్షలాది మంది తమ భూములపై హక్కులు కోల్పోయారు. మా సర్కార్‌‌‌‌ వచ్చాక వాళ్లందరికీ తిరిగి భూములపై హక్కులు కల్పిస్తాం. రాష్ట్రంలో వివిధ రూపాల్లో ప్రజలు భూములు పొందారు. అవన్నీ మా ప్రభుత్వ హయాంలో రికార్డుల రూపంలో పొందుపర్చాం. కానీ బీఆర్ఎస్ సర్కార్ ధరణి తీసుకొచ్చి పట్టా కాలమ్ తప్ప, మిగిలిన అన్ని కాలమ్స్‌‌ను తొలగించింది. మా ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లో అన్ని కాలమ్స్‌‌ పునరుద్ధరించి, ఎవరి భూముల మీద వారికి హక్కులు కల్పిస్తాం” అని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ధరణి వల్ల నష్టపోయిన అనేక మంది తమను కలిశారని, వాళ్లందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు. 

ప్రజా అవసరాలే పార్టీ అజెండా.. 

మార్చి 16 నుంచి ఈ నెల 2 వరకు నిర్వహించిన తన పాదయాత్రలో ప్రజల బాధలను ప్రత్యక్షంగా చూశా నని భట్టి చెప్పారు. సమస్యలకు పరి ష్కారాలు చూపడం, వాళ్ల అవసరా లు తీర్చడమే తమ పార్టీ అజెండాగా ఉంటుందని తెలిపారు. అన్ని వర్గాల జీవితాల్లో మార్పు వచ్చే విధంగా మేని ఫెస్టోను రూపొం దించి, అధికా రంలోకి రాగానే అమలు చేస్తామన్నా రు. ‘‘కొట్లాడి తెచ్చుకు న్న రాష్ట్రంలో సంపద, వనరులు, స్వేచ్ఛ.. పాలకులకే పరిమితమైనయ్. వాటిని ప్రజలకు చేర్చడమే లక్ష్యంగా మా పార్టీ పనిచే స్తుంది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌర‌‌వం కోసం తెలంగాణ ఉద్య మం జరిగింది. కానీ ఆ ఆశయాలు నెరవేరలేదు” అని అన్నారు. 

కాళేశ్వరంతో ఒక్క ఎకరాకూ నీళ్లియ్యలే.. 

ఉచిత కరెంట్‌‌ పథకంపై పేటెంట్ తమ పార్టీదేనని భట్టి అన్నారు. ‘‘ఉచిత కరెంట్ ఇస్తామని 1999 నాటి మేనిఫెస్టోలో పొందుపర్చాం. అప్పుడు మేం అధికారంలోకి రాలేదు. 2004లో అధికారంలోకి వచ్చాక ఆ హామీని నెరవేర్చాం. విభజన చట్టంలో 53.7 శాతం విద్యుత్‌‌ను తెలంగాణకు కేటాయించింది కూడా మా ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాది, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి పదేండ్లవుతున్నా ఇప్పటికీ పూర్తి చేయలేదు. మా ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన ప్రాజెక్టుల నుంచే కరెంట్ వస్తున్నది. అలాగే రాష్ట్రంలో పారే ప్రతి నీటి చుక్క, పండే ప్రతి కంకి గతంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఫలితమే. బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేయడం తప్ప.. కృష్ణా, గోదావరి నదుల నుంచి ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేదు. మా పాలనలో మొదలుపెట్టిన ప్రాణహిత పూర్తయితే ఆదిలాబాద్ లో మూడు నియోజకవర్గాలకు నీళ్లు అందేవి. కానీ కాంగ్రెస్‌‌కు పేరు వస్తుందని, కేసీఆర్ దాన్ని పక్కన పెట్టారు. లక్ష కోట్లు పెట్టి ఖర్చు చేసిన కాళేశ్వరంతో ఇప్పటివరకు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు” అని భట్టి ఫైర్ అయ్యారు.