ఆ టెర్రరిస్టులు ఇక్కడివాళ్లే కావొచ్చు.. పాక్ నుంచి వచ్చారనేందుకు సాక్ష్యాలేవి..? చిదంబరం

ఆ టెర్రరిస్టులు ఇక్కడివాళ్లే కావొచ్చు.. పాక్ నుంచి వచ్చారనేందుకు సాక్ష్యాలేవి..? చిదంబరం

న్యూఢిల్లీ: కాంగ్రెస్  సీనియర్  నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. పహల్గాం టెర్రరిస్టులు ఇక్కడివాళ్లే కావొచ్చన్నారు. వారు పాకిస్తాన్ నుంచి వచ్చారని కేంద్రం ఎలా నిర్ధారించిందని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిపై అంతర్జాతీయ వేదికలో పాక్‏ను బాధ్యులుగా చేసేందుకు విదేశాలకు సాక్ష్యాధారాలు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ముందే జాగ్రత్తపడి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు.

 ‘‘ఉగ్రవాదులను ముందే ఎందుకు ఎదుర్కోలేదు..? ఇంతవరకూ ఆ ముష్కరులను ఎందుకు గుర్తించలేదు..? టెర్రర్  అటాక్  ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు..? ఇంతకీ ఎన్ఐఏ ఆ ఉగ్రవాదులను గుర్తించిందా..? టెర్రరిస్టులు పాక్  నుంచే వచ్చారనడానికి ఆధారాలు ఏమున్నాయి..? టెర్రరిస్టులు ఇక్కడి వారే అయుండొచ్చు కదా..?” అని చిదంబరం ప్రశ్నించారు. 

ఆపరేషన్ సిందూర్  సమయంలో మన దేశానికి జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను కూడా మోదీ ప్రభుత్వం దాచిపెడుతున్నదని ఆయన ఆరోపించారు. ‘‘సీజ్ ఫైర్​ను ప్రకటించింది భారత ప్రభుత్వం కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్. అందుకే ఈ విషయంపైనా చర్చకు మోదీ సర్కారు భయపడుతోంది’’ అని చిదంబరం వ్యాఖ్యానించారు.

మరోసారి పాక్‎కు వంత పాడారు: బీజేపీ

చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. మరోసారి పాకిస్తాన్‎కు కాంగ్రెస్  క్లీన్ చిట్ ఇచ్చిందని బీజేపీ ఐటీ సెల్  అమిత్  మాలవీయ అన్నారు. ‘‘కాషాయ ఉగ్రవాదం అన్న పదాన్ని ప్రతిపాదించిన వారిలో ఒకరైన చిదంబరం తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. పాక్  ప్రేరేపిత ఉగ్రవాదంపై మన బలగాలు పోరాడుతుంటే, కాంగ్రెస్  నేతలు మాత్రం పాక్ డిఫెన్స్ లాయర్లలాగా మాట్లాడుతున్నారు” అని మాలవీయ ‘ఎక్స్’ లో కౌంటర్  ఇచ్చారు.