కరోనా మరణాలపై ఆడిట్​ చేయించండి

కరోనా మరణాలపై ఆడిట్​ చేయించండి
  • హైకోర్టులో దాసోజు శ్రవణ్​ పిల్​

హైదరాబాద్, వెలుగు: కరోనాతో రాష్ట్రంలో లక్షా 20 వేల మంది చనిపోయారని, కానీ, 3,912 మందే చనిపోయారంటూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల సాయం ప్రకటించిందని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కల వల్ల తక్కువ మందికే సాయం అందుతుందని ఆయన విమర్శించారు. మిగతా వాళ్ల పరిస్థితేందని నిలదీశారు. అందరికీ న్యాయం జరగాలంటే మరణాల అసలు సంఖ్య బయటపెట్టాలని, అందుకు కొవిడ్​ డెత్​ ఆడిట్​ చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆయన కరోనా మరణాల లెక్కలపై ఆడిట్​ చేయించాలని కోరుతూ గురువారం హైకోర్టులో పిల్​ వేశారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కరోనా మరణాల సంఖ్యను దాచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు కరోనా లేనేలేదంటూ జనాలకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారన్నారు.