టీఆర్ఎస్ నేతలు పోలీస్ వ్యవస్థను నాశనం చేసిన్రు

టీఆర్ఎస్ నేతలు పోలీస్ వ్యవస్థను నాశనం చేసిన్రు

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోలీస్ వ్యవస్థను నాశనం చేసిండ్రని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులు కూడా డూడూ బసవన్న తరహాలో పనిచేస్తున్నారని విమర్మించారు. సీఐలు, ఎస్ఐల నుంచి కింది స్థాయి పోలీసులు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఐపీఎస్ అధికారులకు జీతాలు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి రావడం లేదని శ్రవణ్ అన్నారు. ప్రజలు కట్టిన పన్నులను జీతాలుగా తీసుకొని పోలీస్ మాడ్యూల్ ను కాలరాస్తున్నారని, స్టేషన్ హౌస్ పోలీసుల పరిస్థితి హచ్ డాగ్స్ లా మారిందని వ్యాఖ్యానించారు. 

జనానికి రక్షణగా ఉండాల్సిన వాళ్లు ప్రజాప్రతినిధులకు సలాం కొడ్తున్నారని శ్రవణ్ విమర్శించారు. పోలీసు శాఖలో మెరిట్ ఆధారంగా బదిలీలు జరగడం లేదన్న ఆయన.. ఎమ్మెల్యే, మంత్రుల లెటర్ల ఆధారంగా పోలీస్ ట్రాన్స్ ఫర్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మధ్యనే డీజీపీ మహేందర్ రెడ్డి ట్రాన్స్ ఫర్ రద్దైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన శ్రవణ్... దీన్ని బట్టి టీఆర్ఎస్ ప్రతినిధుల ఒత్తిడి ఏ విధంగా వుందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్రమాలు మాములుగా లేవని విమర్శించారు. 50 కోట్ల విలువైన భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే వారిని అడ్డుకున్న సీఐపై బదిలీ వేటు వేశారని అన్నారు. 

బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో దానం దందాలు నడుస్తున్నాయని శ్రవణ్ ఆరోపించారు. రాడిసన్ పబ్ నిబంధనలు పాటించడంలేదని గతంలో కఠినంగా వ్యవహరించిన పోలీస్ అధికారుల్లో ఒకరిని బదిలీ చేయగా.. మరొకరిని సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు దానం, మాగంటి గోపీనాధ్ మధ్య బస్తీమే సవాల్ అన్నట్లుగా పోరు జరుగుతోందన్నారు. వాళ్ల మనుషులు పీఎస్ లో ఉండేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. సిటీ కమిషనర్ సీపీ ఆనంద్ మంచి పోలీస్ ఆఫీసర్ అని అయినా ఆయన మాట కూడా నడుస్తలేదని దాసోజు తెలపారు. డ్రగ్స్, పబ్స్, అఘాయిత్యాలకు ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ అడ్డాగా మారిందన్న ఆయన.. సీఎం కేసీఆర్ వీటిపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.