- అనర్హులకు పెన్షన్‌పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబాలకు పెన్షన్లు ఇచ్చి బీఆర్ఎస్ సర్కారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం ఫైర్ అయ్యారు. 2014 నుంచి 2023 మధ్య 5 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ పెన్షన్, ఆసరా పెన్షన్ రెండు తీసుకున్నారని ప్రభుత్వ పరిశీలనలో తేలిందని ఆయన గుర్తు చేశారు. ఆదివారం గాంధీభవన్ లో గజ్జెల కాంతం మీడియాతో మాట్లాడారు. లబ్ధిదారుల నుంచి పెన్షన్ రికవరీ చేస్తున్నారని కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఖజనాను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆయన ఆరోపించారు. అధికార బలంతో బీజేపీ 10 రాష్ట్రాల్లో వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 2014 నుంచి 23 వరకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే లను కొన్న బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఫిరాయింపుల చట్టం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ ల నియంత పోకడలు నచ్చకనే ఎమ్మెల్యేలు
ఆ పార్టీని వీడుతున్నారని ఆరోపించారు.