శ్వేతపత్రంలో చీకటి నిజాలు దాస్తున్నారు: కేసీ వేణుగోపాల్

శ్వేతపత్రంలో చీకటి నిజాలు దాస్తున్నారు: కేసీ వేణుగోపాల్

​న్యూఢిల్లీ: నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితర దేశంలోని చీకటి సత్యాలను దాచిపెడుతూ ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్రం ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం తీసుకొచ్చిందని కాంగ్రెస్​ పార్టీ విమర్శించింది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన శ్వేతపత్రంపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ మాట్లాడారు. దేశం ముందున్న సమస్యలను పక్కదారి పట్టించి కేంద్ర ప్రభుత్వం వైట్​పేపర్​ను తనకు రక్షణగా వాడుకున్నదని ఆరోపించారు. మాజీ ప్రధానులు పీవీ, చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌లకు భారతరత్నలు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, ప్రభుత్వం వారిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని విమర్శించారు.

శ్వేతపత్రంలో నోట్ల రద్దుకు సంబంధించిన అనర్థాల గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎందుకు ప్రస్తావించలేదని, నిరుద్యోగం, పేదరికం, రూపాయి విలువ పతనం తదితర అంశాలు అందులో ఎందుకు లేవని వేణుగోపాల్ ప్రశ్నించారు. ‘‘ఇది నిజానికి శ్వేతపత్రం కాదు, ఈ దేశంలోని చీకటి నిజాలను దాచే పేపర్’’ అని ఆయన సభలో అన్నారు. బీజేపీ కొత్త హామీలు ఇచ్చే ముందు గతంలో ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని100 రోజుల్లో వెనక్కి తీసుకురావడం, ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాకు రూ.15 లక్షలు, రైతుల ఆదాయం రెట్టింపు, 2023 నాటికి ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధన వంటి వాటి గురించి ఆలోచించాలన్నారు. యూపీఏ హయాంలో విద్యాహక్కు, ఉపాధి హక్కు, సమాచార హక్కు, ఆహార భద్రత చట్టం తీసుకొచ్చామని, ఎంజీఎన్ఆర్ఈజీఏ లాంటి గొప్ప పథకాలను మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారని వెల్లడించారు.

పార్లమెంట్ నిరవధిక వాయిదా

పార్లమెంట్ బడ్జెట్​ సమావేశాలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఉభయ సభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు. ఈ ఐదేళ్ల కాలంలో 17వ లోక్ సభ మొత్తంగా 222 బిల్లులను పాస్ చేసింది. గత నెల 31న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఉభయ సభలలో అయోధ్య రామ మందిరంతో సహా పలు బిల్లులు, అంశాలపై చర్చ జరిగింది. రాజ్యసభలో చైర్మన్ ధన్ ఖడ్​ మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో రాజ్యసభ ఓవరాల్ ప్రొడక్టివిటీ 137 శాతంగా ఉందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.