వారిని అసెంబ్లీ నుంచి బహిష్కరించాలె: పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్

వారిని అసెంబ్లీ నుంచి బహిష్కరించాలె:  పీసీసీ ఉపాధ్యక్షుడు  నిరంజన్

హైదరాబాద్​: ఫోన్​ ట్యాపింగ్​తో సంబంధమున్న వారిని అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని  పీసీసీ ఉపాధ్యక్షుడు  నిరంజన్ డిమాండ్​ చేశారు. ఇవాళ  గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్​మీటల్​లో ఆయన మాట్లాడారు. ఫోన్​ ట్యాపింగ్  వ్యవహారంలో అరెస్టయిన ఎస్ఐబీ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయన్నారు. కేటీఆర్, హరీశ్​రావు సూచనల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆ అధికారి చెప్పారని అన్నారు. 

నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఫోన్లు, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. దీనిని బట్టే నిఘా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థను బీఆర్ఎస్ నేతలు ఎలా వాడుకుని దుర్వినియోగం చేశారో తెలుస్తుందని మండిపడ్డారు.  వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించారన్నారు. 

ప్రత్యేక పరికరాలు తెప్పించి మరీ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫైర్​అయ్యారు. స్పీకర్ వెంటనే ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కోరారు. వీటిపై చర్చించి, బాధ్యులైన వారిని అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని ఆయన కోరారు. అలా చేస్తేనే  ఇక ముందు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఎవరూ ముందుకు రారని ఆయన చెప్పారు.