కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు

కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు

కొండగట్టు/జగిత్యాల:  జైశ్రీరామ్ నినాదాలతో కొండగట్టు గుట్టలు మారుమోగాయి. అంజన్నకు ఇష్టమైన మంగళవారం కావడం, హనుమాన్ పెద్ద జయంతి సమీపిస్తుండడంతో కొండగట్టుకు భక్తుల రాక భారీగా పెరిగింది. నిన్న రాత్రి నుంచే అంజన్న దర్శనానికి వస్తున్నారు. ఇవాళ తెల్లవారు జామునుంచే భక్తులు గుట్టకు పోటెత్తారు. దీంతో ఆలయాన్ని ఉదయం నాలుగున్నర గంటలకే తెరిచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దర్శనానికి దాదాపు 3 గంటలకు‌పైగానే సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. 

దీక్షాపరులు ఆలయ మండపంలో దీక్షా విరమణ చేశారు. సుమారు 20వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు గుట్టకు పోటెత్తడంతో స్థానిక వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీగా తరలివస్తున్న అంజన్న భక్తులతో ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోయింది. బొజ్జ పోతన్న వరకు  వాహనాలు నిలిచిపోయాయి. కాగా హనుమాన్ పెద్ద జయంతిని దృష్టిలో ఉంచుకొని బుధవారం నుంచి ఆర్జిత సేవలు, వాహన పూజలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జయంతి అనంతరం రెండో తారీఖు నుంచి తిరిగి యథావిధిగా సేవలు కొనసాగుతాయన్నారు.