కేసీఆర్ దోచుకున్న డబ్బు తాత్కాలికమే : పొన్నాల

కేసీఆర్ దోచుకున్న డబ్బు తాత్కాలికమే : పొన్నాల

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకున్న డబ్బు తాత్కాలికమేనని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేసీఆర్ రైతు రాజ్యం తెస్తానంటుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు బేడీలు వేసిన విషయం కేసీఆర్ మర్చిపోయారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతు రాజ్యంలో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే 16 లక్షల మంది రైతుల ఖాతాలు ఫ్రిజ్ అయ్యాయని చెప్పారు. రైతులు బయట అధిక వడ్డీలకు డబ్బు తెచ్చుకుని అప్పుల పాలయ్యారని ఆరోపించారు. పంట నష్టపరిహారం, మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. రైతుల దగ్గర మిల్లర్లు వడ్లు కొన్నాక.. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తోందని, ఈ పద్ధతి రైతుకు నష్టం చేసి, మిల్లర్లకు మేలు చేయడమే అని అన్నారు. హైదరాబాద్​ గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య ఈ కామెంట్స్​ చేశారు. 

ఎన్నికల వాగ్థానాలు నెరవేర్చానని చెప్పే దమ్ము కేసీఆర్ కు లేదని పొన్నాల వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారో లెక్కలు ఎందుకు చెప్పడం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితులకు మూడు ఎకరాల భూమి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగొళ్ళలో అవినీతి జరిగిందని, దీనిపై చర్చకు సిద్దమా..? అని సవాల్ చేశారు. ‘కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రంగంలో అయిన అభివృద్ధి, అవినీతిపై చర్చకు మేము సిద్ధం.. మీరు సిద్థమా..’ అంటూ పొన్నాల సవాల్ విసిరారు. ‘తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా..? బీఆర్ఎస్ జెడ్పీటీసీ గొడ్డలితో నరుకుతా అంటూ రోడ్డుపై తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

కేసీఆర్ ఎంత డబ్బు దోచుకున్నా అది శాశ్వతం కాదని..మిషన్ కాకతీయలో కావాల్సినంత దోపిడీ చేశారు.ఇక మిగిలింది ఏం లేదని పొన్నాల తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఎందుకు బయటపెట్టడం లేదన్నారు.  ఫాంహౌస్ ముఖ్యమంత్రి దేశ ప్రయోజనాలు కాపాడుతా అంటే నవ్వొస్తుందన్నారు. ఇక బీజేపీ అభివృద్ధి గురించి మాట్లాడదు..రాజకీయాలే ముఖ్యం అన్నారు. ఉపాధి హామీకి నిధులు తగ్గించారని.. జీఎస్టీ బాగా వసూలు చేస్తున్నామని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు.. భారం పేదల ప్రజలపై వేసి.. మీరు ఆనందపడుతున్నారని విమర్శించారు. 8 రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూలగొట్టి..ప్రజాస్వామ్యం గురించి బీజేపీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటాం అనటం సిగ్గుచేటు అని పొన్నాల విమర్శించారు.