పదేండ్లు ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ : పువ్వాళ్ల దుర్గాప్రసాద్

పదేండ్లు ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ : పువ్వాళ్ల దుర్గాప్రసాద్
  • నేడు ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు
  • కాంగ్రెస్​ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్​ 

మధిర, వెలుగు : ​  ప్రజలకు బూటకపు వాగ్దానాలు చేసి పదేండ్లు మోసం చేస్తూ అధికారాన్ని అనుభవించిన కేసీఆర్, కేటీఆర్ నేడు కాంగ్రెస్​ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్​ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్​ అన్నారు. బుధవారం మధిర మండల పరిధిలోని  దెందుకూరులో నూతనంగా నిర్మించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయ ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్   రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు మోసం చేసిందని, దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, కేజీ టు పీజీ ఉచిత విద్య అందరికీ అందేలా చేస్తామని, ప్రతి ఇంటికీ దళిత బంధు ఇస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని, రైతులకు యూరియా ఉచితంగా ఇస్తామని, అర్హులందరికీ డబ్బులు బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని.. ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందని గుర్తు చేశారు. 

ఇప్పుడు వాటిని మరిచి కాంగ్రెస్​ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు’గా ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా స్థాయిలో పదవులు అనుభవించిన నాయకులు మధిర నియోజకవర్గానికి రూ. 10కోట్ల నిధులు కూడా తీసుకురాలేదని విమర్శించారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే ఎన్నో పథకాలను అమలు చేస్తోందని వివరించారు. చౌకబారు మాటలు మాట్లాడే బీఆర్​ఎస్​ నేతలకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు,  మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్త, సొసైటీ చైర్మన్  కోటా వెంకటకృష్ణ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి,  మండల కిసాన్ సెల్​ నాయకుడు దుంప వెంకటేశ్వర రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు  తదితరులు పాల్గొన్నారు.