మణిపూర్ కంటే ఇజ్రాయెల్ ఎక్కువైందా?

మణిపూర్ కంటే ఇజ్రాయెల్ ఎక్కువైందా?

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
మణిపూర్ మండిపోతున్నా పట్టదా అంటూ విమర్శలు
మిజోరం ఎన్నికల పాదయాత్రలో రాహుల్

ఐజ్వాల్: మణిపూర్​లో 5 నెలలుగా అల్లర్లు జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోలే.. ఆయనకు మణిపూర్ కన్నా ఇజ్రాయెలే ఎక్కువైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇజ్రాయెల్​పై మోదీకి అంత ప్రేమ ఎందుకో అర్థం కావట్లేదన్నారు. మణిపూర్​పై ఇప్పటివరకూ మాట్లాడని మోదీ.. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై వెంటనే స్పందించారని ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్​లో ఏం జరుగుతుందనే దానిపైనే మోదీకి ఇంట్రెస్ట్ ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాహుల్ రెండు రోజుల పాటు మిజోరంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఐజ్వాల్ చేరుకున్న రాహుల్.. చన్మరీ జంక్షన్ నుంచి రాజ్​భవన్ నిలయం వరకు నిర్వహించిన 2 కి.మీ. పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు.

 ‘‘నేను మణిపూర్​లో పర్యటించా. ఆ రాష్ట్రం మొత్తాన్నీ బీజేపీ నాశనం చేసింది. ఆ రాష్ట్రం త్వరలోనే విడిపోతుంది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలను చంపేస్తున్నారు. జనం హత్యకు గురవుతున్నారు. ఇవన్నీ ప్రధాని మోదీకి పట్టడం లేదు. మణిపూర్​లో ఏం జరుగుతున్నదో తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు కానీ.. ఇజ్రాయెల్ గురించి మాత్రం ఆయన చాలా ఆసక్తి చూపిస్తున్నారు” అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

మణిపూర్ అల్లర్లు.. మోదీకి చిన్న ఇష్యూ

హింసతో అట్టుడుకుతున్న మణిపూర్​లో ఇప్పటి దాకా ప్రధాని మోదీ పర్యటించకపోవడం సిగ్గుచేటు అని రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీకి మణిపూర్ అల్లర్ల అంశం చిన్నదిగా కనిపిస్తున్నదని, దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని అన్నారు.

39 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

మిజోరంలోని 40 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ అధిష్టానం 39 సీట్లకు అభ్యర్థులను సోమవారం ప్రకటించింది. పార్టీ స్టేట్ యూనిట్ చీఫ్ లాల్​సవ్తా ఐజ్వాల్ వెస్ట్–3 నుంచి పోటీ చేయనున్నారు. లాల్​నున్​మావియా ఐజ్వాల్ నార్త్–1(ఎస్టీ) నుంచి, లాల్​రిందికా రాల్తే హచెక్(ఎస్టీ) నుంచి, లాల్​మింగ్​తంగా సెయిలో నుంచి, లాల్​రిన్​మావియా ఐజ్వాల్ నార్త్– 2నుంచి బరిలో ఉంటారు.