మేం అధికారంలోకి రాగానే కులగణన చేస్తం

మేం అధికారంలోకి రాగానే  కులగణన చేస్తం

 

  • మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ 
  • కోటానూ అమలు చేస్తం 
  •  కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ 

న్యూఢిల్లీ: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. చట్టసభల్లో మహిళలకు ఇవ్వనున్న 33% రిజర్వేషన్లలో ఓబీసీ కోటానూ అమలు చేస్తామని ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్​లో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తం. అప్పుడు దేశంలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు.. కానీ మేం చేస్తం” అని ఆయన చెప్పారు. 2010లో యూపీఏ హయాంలో రాజ్యసభ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ కోటాను చేర్చనందుకు ఫీల్ అవుతున్నారా? అని ప్రశ్నించగా.. ‘‘అవును.. 100% పశ్చాత్తాప పడుతున్నాం. మేం అప్పుడే చేసి ఉండాల్సింది” అని తెలిపారు. ‘‘దేశంలో అందరికీ అధికారం దక్కాలంటే.. ఏ వర్గం ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలియాలి. వెంటనే కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలి. యూపీఏ హయాంలో కులాల వారీగా చేసిన జనాభా లెక్కలను 
బయటపెట్టాలి” అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

కులగణన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. 

మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ డిమాండ్ చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ల బిల్లు చాలా గొప్పది. కానీ దానికి జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజనతో కేంద్ర ప్రభుత్వం ముడిపెట్టింది. దీని వల్ల పదేండ్ల తర్వాత గానీ మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావు. ఈ బిల్లును కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తీసుకొచ్చింది. కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మహిళా బిల్లును తెచ్చింది” అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఓబీసీలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ‘‘కేంద్రంలో ముఖ్యమైన శాఖల సెక్రటరీలు 90 మందిలో కేవలం ముగ్గురే ఓబీసీలు ఉన్నారు. బడ్జెట్ లో ఓబీసీలకు కేటాయిస్తున్న నిధులు 5% మాత్రమే” అని చెప్పారు.