కన్నడ నాట రాజకీయ వేడి మరింతగా ముదిరింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరి కొన్ని గంటలో ముగియనున్న వేళ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రచార తీరునే మార్చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచార సరళిలో వినూత్నతను ప్రదర్శిస్తున్నారు. మే 7న స్కూటీపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్, సోమవారం కూడా ఇదే సరళిలో ప్రచారం నిర్వహించారు. బెంగళూరు సిటీ బస్సులో ప్రయాణిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు . రాహుల్ ని చూడగానే పలువురు మహిళాభిమానులు షాక్ తిన్నారు.
మేనిఫెస్టో ని వివరిస్తూ..
బీజేపీ ప్రభుత్వంలో కర్ణాటకలో అన్ని ధరలు పెరిగిపోయాయని రాహుల్ అన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ కి ఓటు వేస్తే తాము చేయబోయే పనులను ప్రయాణికులకు వివరించారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో ఉంచిన హామీలను మహిళా ప్రయాణికులకు వివరించారు.
బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందో చూడాలంటే మరో 5 రోజులు ఆగాల్సిందే.