బీఆర్​ఎస్​ పార్టీలో.. మాకూ కోవర్టులున్నరు :   రేణుకా చౌదరి 

బీఆర్​ఎస్​ పార్టీలో.. మాకూ కోవర్టులున్నరు :   రేణుకా చౌదరి 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. కాంగ్రెస్ లీడర్లే లక్ష్యంగా పువ్వాడ అజయ్, బీఆర్ఎస్ లీడర్లు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఖమ్మం కార్పొరేటర్ రఫీనా బేగంపై బైండోవర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలను బెదిరిస్తే ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. గాంధీభవన్​లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఓడిపోయిన మరుక్షణం పువ్వాడ అజయ్ అక్కడి నుంచి పారిపోతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​లో గెలిచి పార్టీ మారిన పువ్వాడ అజయ్ లాంటి వారిని దగ్గరకు తీసుకోవడం వల్లే కేసీఆర్ ఓడిపోతున్నారన్నారు.

పువ్వాడ అజయ్ పాము లాంటోడని, పాలు పోసి పెంచితే కాటు వేసే రకమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, కూలిపోయే డబుల్ బెడ్రూం ఇండ్లే కేసీఆర్ సర్కార్​ను కూల్చేస్తాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నాయని, మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరు గెలుస్తున్నారో చెప్పే ఎగ్జిట్ పోల్స్​తో పనిలేదని, తన పోల్స్ ప్రకారం కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు. తన ఫోకస్ ఖమ్మంపైనే ఉందని,  నామినేషన్ల ఉపసంహరణ అయిపోగానే ఖమ్మంలో ప్రచారం చేస్తానని తెలిపారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లోనే ఐటీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్​లో ఎంత మంది కోవర్టులున్నారో తమకు తెలుసని, మాకూ కోవర్టులున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాలో పది స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.