రూ.500 కోట్లు ఇస్తే సీఎం అవుతరు.. కాంగ్రెస్‌‌‌‌ నేత సిద్ధూ భార్య కౌర్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్య

రూ.500 కోట్లు ఇస్తే సీఎం అవుతరు.. కాంగ్రెస్‌‌‌‌ నేత సిద్ధూ భార్య కౌర్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: సీఎం పదవిపై కాంగ్రెస్‌‌‌‌ నాయకుడు నవజ్యోత్‌‌‌‌ సింగ్‌‌‌‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే రూ.500 కోట్లు ఇస్తారో వారు సీఎం అవుతారని పేర్కొన్నారు. గవర్నర్‌‌‌‌‌‌‌‌ గులాబ్‌‌‌‌ చంద్‌‌‌‌ కటారియాను కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ సీఎం అభ్యర్థిగా సిద్ధూను ప్రకటిస్తే.. తిరిగి ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని తెలిపారు. అయితే ఏ పార్టీకి ఇవ్వడానికి తమ వద్ద డబ్బు లేదని, కానీ, పంజాబ్‌‌‌‌ను స్వర్ణ రాష్ట్రంగా మార్చగలమని ఆమె అన్నారు. 

‘‘మేం ఎల్లప్పుడూ పంజాబ్, పంజాబీల కోసం మాట్లాడతాం. కానీ, సీఎం సీటులో కూర్చోవడానికి మా వద్ద రూ.500 కోట్లు లేవు” అని వ్యాఖ్యానించారు. ఎవరైనా మీ నుంచి డబ్బు డిమాండ్‌‌‌‌ చేశారా అని మీడియా ప్రశ్నించగా, ఎవరూ చేయలేదని సమాధానం ఇచ్చారు. అయితే, రూ.500 కోట్ల సూట్‌‌‌‌కేసు ఇచ్చిన వ్యక్తి సీఎం అవుతారన్నారు. పంజాబ్‌‌‌‌ కాంగ్రెస్‎లో ఐదుగురు నాయకులు సీఎం పదవిని ఆశిస్తున్నారని, వారు సిద్ధూను ముందుకు రానివ్వడం లేదని ఆరోపించారు.