కాంగ్రెస్ నేతలే దాడులను ప్రోత్సహిస్తున్నరు : మంత్రి నిరంజన్​ రెడ్డి ఆరోపణలు

కాంగ్రెస్ నేతలే దాడులను  ప్రోత్సహిస్తున్నరు :  మంత్రి నిరంజన్​ రెడ్డి ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్​రెడ్డిపై హత్యాయత్నం హేయమైన, అనాగరికమైన చర్య అని మంత్రి నిరంజన్ ​రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్​లో నాగం జనార్దన్​రెడ్డి, రావుల చంద్రశేఖర్​రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లీడర్ల మాటలు, చర్యలు చూసి కార్యకర్తలు కూడా అలాగే తయారవుతున్నారని, ప్రభాకర్​ రెడ్డిపై దాడి ఆ కోవలోకే వస్తుందన్నారు. కాంగ్రెస్ ​నేతలు నైరాశ్యంలోనే హింసను ప్రోత్సహిస్తున్నారని, వాళ్ల తీరు, భాష మార్చుకోవాలన్నారు.

తెలంగాణ బిడ్డలు స్వరాష్ట్రం కోసం తమకు తాముగా బలిదానాలు చేసుకున్నారే తప్పా ఎవరిపైనా దాడులు చేయలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ది ఆర్టిఫిషియల్ ​హైప్​అని నాగం అన్నారు. ఆ పార్టీ గ్రాఫ్ ​వేగంగా పడిపోతున్నదన్నారు. పొంగులేటి, జూపల్లి లాంటి వాళ్ల చేరికతో వచ్చింది పాల పొంగు మాత్రమేనన్నారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్​రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన తనకు లేదని, ప్రజా సేవ చేయడానికే బీఆర్ఎస్​లోకి వచ్చానన్నారు. బీఆర్ఎస్​లోకి వస్తే తన కుటుంబంలోకి వచ్చినట్టు ఉందన్నారు.