భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు : జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సక్సెస్ కావడంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న టైంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు జిల్లాలో పర్యటించడంతో నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్ల ఘట్టం పూర్తి అయింది.
మూడో విడత నామినేషన్లు ప్రారంభం అవుతున్న టైంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటన పార్టీకి ఎంతో లాభం కలిగిస్తొందని నేతలు పేర్కొంటున్నారు. సీఎం ముందుగా అనుకున్న సమయం కన్నా రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చినా ప్రజలు ఓపికగా వేచిఉన్నారు.
దేశంలోనే మొదటి ఎర్త్ సైన్సెస్ వర్సిటీని జిల్లాలో ఏర్పాటు చేయడం పట్ల యువత సంతోషం వ్యక్తం చేస్తోంది. అనేక కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తాయని, యువతకు భారీగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలుంటాయని వారు ఆశిస్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు మాట్లాడుతున్న టైంలో స్టూడెంట్స్ పెద్ద ఎత్తున డ్యాన్స్‌లు, ఈలలు వేశారు. స్టూడెంట్స్ ఉత్సాహాన్ని చూసిన సీఎం మాట్లాడుతూ మీ ఉత్సాహం ఇచ్చిన ఊపిరిని తీసుకుంటానని చెప్పడంతో జోష్ నింపింది. సీఎం పర్యటన సందర్భంగా పాల్వంచతో పాటు కొత్తగూడెంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ బి.రోహిత్ రాజు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
దేశానికే తలమానికం:తుమ్మల
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ దేశానికే తలమానికంగా మారుతుందని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి నీటిని అందించేందుకు ప్రభుత్వం రూ. 20వేల కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. పాల్వంచలో మరో థర్మల్ పవర్‌స్టేషన్ కూడా రానుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విమానాశ్రయం, రైల్వే లైన్లు రావాల్సి ఉందన్నారు.
హామీలను అమలు చేస్తున్నాం: పొంగులేటి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ఎర్త్ సైన్సెస్ వర్శిటీతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ ఇచ్చిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్పేరిట వర్శిటీని ఏర్పాటు చేశామన్నారు.
పాల్వంచలో ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీతో పాటు థర్మల్ పవర్ స్టేషన్ సాంక్షన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాతో పాటు నియోజకవర్ల సమస్యలపై ఆయన సీఎంకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావ్, కార్పోరేషన్ చైర్మన్లు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ బి. రోహిత్ రాజు, అడిషనల్కలెక్టర్ డి. వేణుగోపాల్, ప్రిన్సిపాల్ జగన్మోహన్ రాజు పాల్గొన్నారు.
ఎర్త్ వర్సిటీని ప్రపంచస్థాయి గుర్తింపు : భట్టి
భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్శిటీని అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఎర్త్ సైన్సెస్ వర్శిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌ను ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అపారమైన ఖనిజ వనరులున్న జిల్లాలో భూగర్భ, భూ ఉపరితల, వాతావరణ పరిస్థితులపై పరిశోధనలకు ఈ వర్సిటీ కేంద్రం కానుందన్నారు.
