మణుగూరు బీఆర్‌‌ఎస్‌‌ ఆఫీస్‌..ఫర్నిచర్‌ ధ్వంసం, నిప్పు

మణుగూరు బీఆర్‌‌ఎస్‌‌ ఆఫీస్‌..ఫర్నిచర్‌ ధ్వంసం, నిప్పు
  •     ర్యాలీగా వచ్చి దాడి చేసిన కాంగ్రెస్‌ లీడర్లు
  •     తమ ఆఫీస్‌‌ను తాము స్వాధీనం చేసుకున్నామంటూ ప్రకటన

మణుగూరు, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఆఫీస్‌‌పై ఆదివారం కాంగ్రెస్‌‌ నాయకులు దాడి చేసి, ఫర్నిచర్‌‌ను తగులబెట్టారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్‌‌ అమలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొందరు కాంగ్రెస్‌‌ నాయకులు ఆదివారం ఉదయం మణుగూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఆఫీస్‌‌లోకి చొరబడి అక్కడ ఉన్న ఆ పార్టీ కార్యకర్తలపై దాడి చేసి, ఆఫీస్‌‌లోని ఫర్నిచర్‌‌ను ధ్వంసం చేశారు. 

సోఫాలు, కంప్యూటర్లు, లాప్‌‌టాప్స్‌‌, బీరువాలను బయటపడేసి కాల్చి వేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, 144 సెక్షన్‌‌ అమలు చేశారు. 

కాంగ్రెస్‌‌ ఆఫీస్‌‌ను కబ్జా చేశారంటూ...

1984లో అప్పటి కాంగ్రెస్‌‌ నాయకుడు పిల్లారిశెట్టి సత్యనారాయణ ఆఫీస్‌‌ నిర్మాణానికి మూడు సెంట్ల స్థలాన్ని దానంగా ఇచ్చారు.2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు పార్టీ ఆఫీస్‌‌ను నిర్మించారు. 2019లో కాంగ్రెస్ నుంచి బీఆర్‌‌ఎస్‌‌లో రేగా కాంతారావు.. ఆ ఆఫీస్‌‌ను కాంగ్రెస్‌‌కు ఇవ్వకుండా బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఆఫీస్‌‌గా మార్చారు. అప్పటినుంచి పలుమార్లు గొడవలు జరిగాయి. గతంలో భట్టి విక్రమార్క, పోరిక బలరాంనాయక్‌‌ తదితర నాయకులు మణుగూరు వచ్చి ఆందోళన చేసినా అప్పటి బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం పట్టించుకోలేదు.

 దీంతో ఎప్పటికైనా తమ ఆఫీస్‌‌ను స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్‌‌ నాయకులు ప్రకటించారు. ఎన్నికలకు ముందు మణుగూరుకు వచ్చిన రేవంత్‌‌రెడ్డి సైతం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తమ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలోనే ఆదివారం కాంగ్రెస్ లీడర్లు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగి, ఆఫీస్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. 

కాంగ్రెస్‌‌ దాడిని ఖండిస్తున్న : రేగా కాంతారావు

మణుగూరులో పార్టీ ఆఫీస్‌‌పై దాడి విషయాన్ని తెలుసుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌‌ఎస్‌‌ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హైదరాబాద్ నుంచి మణుగూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ నాయకులు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఎలాంటి ఆందోళనలకు దిగొద్దని సూచించారు. అభివృద్ధి చేతకాని కాంగ్రెస్‌‌ పార్టీ.. చౌకబారు పనులు చేస్తోందని మండిపడ్డారు. జిల్లాలో రోడ్ల పరిస్థితిని ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేని కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే.. తాను స్థానికంగా లేని టైం చూసి కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేయించారని, ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటానని హెచ్చరించారు.